కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యకర్త అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతున్న నాయకుడిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని బహార్‌పేట్ చౌరస్తా వద్ద పోలీసులు పట్నం నరేందర్‌రెడ్డి వాహనాన్ని అడ్డుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోస్గిలో మరణించిన ఓ బీఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియలకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున, ముందస్తు జాగ్రత్త చర్యగానే నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ అరెస్టుతో ఆగ్రహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పరామర్శించేందుకు వెళుతున్న నాయకుడిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? బాధిత కుటుంబానికి అండగా నిలవడం కూడా ఇందిరమ్మ రాజ్యంలో నేరమైందా? నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడమే కాంగ్రెస్‌ పార్టీ పాలనగా మార్చుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు బీఆర్‌ఎస్‌ ఏమాత్రం భయపడదు. ప్రజల, కార్యకర్తల పక్షాన పోరాటం కొనసాగుతుంది. పట్నం నరేందర్‌రెడ్డిని ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

మరోవైపు, పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఖండించారు. ప్రతిపక్ష నేతలను అకారణంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పార్టీ నేతలు స్పష్టం చేశారు.