ఇతర దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు చైనా విదేశీ పౌరులను నిర్బంధిస్తోందా? వారిని దౌత్యపరమైన బేరసారాలకు సాధనంగా ఉపయోగించుకుంటోందా? చైనాలో విదేశీయులను అదుపులోకి తీసుకుంటున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజింగ్‌ అనుసరిస్తున్న ఈ వైఖరిని ‘హోస్టేజ్‌ డిప్లొమసీ’గా ఓ నివేదిక అభివర్ణించింది.

చైనా పోలీసులు, దేశ భద్రతా మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎస్‌) విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోందని ‘ది డిప్లొమాట్‌’లో ప్రచురితమైన కథనం పేర్కొంది. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఘటనలు వాస్తవ పరిస్థితికి చిన్న భాగం మాత్రమే కావచ్చని నివేదిక అభిప్రాయపడింది. విదేశీ పౌరులను తమ విదేశాంగ విధానానికి ఉపయోగపడే సాధనాలుగా భావించినప్పుడు వారిని నిర్బంధించేందుకు చైనా అధికారులు మరింత వెనుకాడటం లేదని తెలిపింది.

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఓ పౌరుడిని చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనను సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు పీటర్‌ డాలిన్‌ ప్రస్తావించారు. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విడుదల చేయాలని చెక్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఇది జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఇద్దరు పౌరులు, జపాన్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా చైనా అధికారుల చర్యలకు గురైనట్లు తెలిపారు. అరుదైన ఖనిజాల రంగంలో పనిచేస్తున్న జపాన్‌ వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. ఓ బ్రిటిష్‌ పౌరుడు జైలు నుంచి విడుదలైన విషయం ఇటీవలే బయటపడిందని, ఓ చైనా జర్నలిస్టు ఆచూకీ, పరిస్థితి ఇప్పటికీ తెలియరాలేదని వెల్లడించారు. చైనా న్యాయవాదులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వీరంతా సాధారణ అరెస్టు లేదా నిర్బంధానికి గురైనవారు మాత్రమే కాదని డాలిన్‌ పేర్కొన్నారు. నిర్దేశిత ప్రదేశంలో, వారిని బయటి ప్రపంచానికి తెలియకుండా ఉంచుతున్నారని ఆరోపించారు. గతంలో తాను కూడా ఈ విధానానికి బాధితుడినని వెల్లడించారు.

చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తోందని డాలిన్‌ అభిప్రాయపడ్డారు. విదేశీ పౌరులను ఇతర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించుకోవడమే ఈ ధోరణిలోని అసలు ఆందోళనకర అంశమని పేర్కొన్నారు.