రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ అభివృద్ధి పనుల విషయంలో కేంద్రంతో కలిసి పనిచేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయంటూ జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. రాజకీయాలను, అభివృద్ధిని వేర్వేరుగా చూడాలని వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయాల్లో పోటీ పడతాం.. అభివృద్ధిలో సహకరించుకుంటాం’’ అని పేర్కొన్నారు.

బెంగళూరులో శుక్రవారం పింక్‌లైన్‌ మెట్రో ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో మోదీతో శివకుమార్‌ సరదాగా మాట్లాడటం, సన్నిహితంగా మెలగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ సందర్భాలను ఎవరికి నచ్చినట్లు వారు అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలను ప్రస్తావించానని తెలిపారు.

మేకెదాటు ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇప్పించాలని మోదీని కోరినట్లు శివకుమార్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లేందుకు అంగీకరించాయని చెప్పారు. అటవీ, పర్యావరణ అనుమతులు సహా పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. కస్తూరిరంగన్‌ నివేదికను తిరస్కరించాలని, మెట్రో ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సాంకేతిక కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. మెట్రో ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రానికి సమాన వాటా ఇవ్వాలని, బెంగళూరులో 500 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాల లక్ష్యాన్ని చేరుకునేందుకు పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరినట్లు వివరించారు.

డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్ల నిర్మాణంపైనా మోదీతో చర్చించినట్లు చెప్పారు. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడతో కలిసి నగర అవసరాలను ప్రధానికి వివరించామన్నారు. ఇతర ప్రాంతాల్లో రహదారులు 18-20 శాతం మేర ఉంటే బెంగళూరులో ఆ వాటా 8 శాతమేనని తెలిపారు. భూసేకరణకు చదరపు అడుగుకు సుమారు రూ.50 వేల పరిహారం చెల్లించాల్సి వస్తోందని, అయినా ఫ్లైఓవర్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్రం వాటా భరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాష్ట్ర డిమాండ్లపై అఖిలపక్ష బృందంతో ఢిల్లీకి వెళతానని పునరుద్ఘాటించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత స్పందిస్తానని చెప్పారు. బెలగావిలోని సువర్ణ విధానసౌధ విద్యుత్‌ బిల్లుల బకాయిలపై మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్‌ అందుకుంటున్న రైతుల బిల్లులూ పెరిగాయని వివరించారు. వాటి మొత్తం రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు చేరిందన్నారు. కరవు కారణంగా రైతులు నీటి ట్యాంకులు నింపేందుకు ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్నారని, పరిస్థితిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.