హైదరాబాద్‌లో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన ‘గ్రీన్ ఎస్‌ఎమ్’ ఎలక్ట్రిక్ క్యాబ్ సంస్థ తీరుపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఒక కంపెనీ తన వ్యాపార విస్తరణ కోసం స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తోందని ఆరోపించారు.

గ్రీన్ ఎస్‌ఎమ్ వ్యాపార వ్యూహాన్ని గతంలో టెలికాం రంగంలో జియో ప్రవేశంతో ఆయన పోల్చారు. "2016లో జియో అనే కంపెనీ ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ అనే ఆఫర్‌తో ప్రజల ముందుకొచ్చింది. ఫ్రీ ఆఫర్‌తో జియో రాగానే ఎయిర్‌సెల్, టాటా డొకోమో, రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్ వంటి కంపెనీలు కనుమరుగయ్యాయి. వొడాఫోన్, ఐడియా కలిసిపోయాయి. పోటీదారులంతా లేకుండా పోయాక లక్షల మంది కస్టమర్లు వచ్చాక జియో రేట్లు పెంచడం మొదలుపెట్టింది. ఇప్పుడు గ్రీన్ ఎస్‌ఎమ్ అనే కంపెనీ కూడా సరిగ్గా అదే చేయబోతోంది" అని పేర్కొన్నారు.

ప్రస్తుతం కిలోమీటరుకు రూ.8 అంటూ తక్కువ ధరలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారని ఆయన చెప్పారు. "ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లంతా మీ ఆటోలు, క్యాబ్‌లు బంద్ చేసుకోండి.. మీ ర్యాపిడోలు ఆపేసి మా దగ్గరకు వచ్చి జీతానికి డ్రైవర్లుగా చేరండి అని గ్రీన్ ఎస్‌ఎమ్ పరోక్షంగా చెబుతోంది" అని విమర్శించారు. ఈ పరిణామాల వల్ల రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మంది డ్రైవర్ల జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు.