బెంగళూరులో కొత్త కష్టం.. ఇంటి నుంచే ట్రాఫిక్ జామ్.. అపార్ట్‌మెంట్ గేటు దాటడానికే అరగంట!

బెంగళూరులో కొత్త కష్టం.. ఇంటి నుంచే ట్రాఫిక్ జామ్.. అపార్ట్‌మెంట్ గేటు దాటడానికే అరగంట!

New trouble in Bengaluru traffic jam from home half an hour to cross the apartment gate
  • బెంగళూరులో కొత్తగా వెలుగు చూసిన ట్రాఫిక్ సమస్య
  • అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ గేటు దాటడానికే 30 నిమిషాలు 
  • వర్తూర్ ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో ఘటన
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్
  • భారీ ప్రాజెక్టులే కారణమంటూ నెటిజన్ల కామెంట్లు
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు కొత్తేమీ కాదు. కానీ, ఆ సమస్య ఇప్పుడు ప్రధాన రహదారులకే పరిమితం కాకుండా ఏకంగా నివాస సముదాయాల లోపలికి కూడా పాకింది. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుంచి బయటకు రావడానికే సుమారు 30 నిమిషాల సమయం పడుతోందంటే అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, బెంగళూరు ట్రాఫిక్ సమస్యలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. '@her_wandering_footprints' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. నగరంలోని వర్తూర్ ప్రాంతంలో ఉన్న తన అపార్ట్‌మెంట్ గది నుంచి ఆమె ఈ దృశ్యాలను రికార్డ్ చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తీసిన ఈ వీడియోలో మొదట బయట రోడ్డుపై ఉన్న భారీ ట్రాఫిక్‌ను చూపించారు. 

ఆ తర్వాత పక్కనే ఉన్న మరో నివాస సముదాయంపైకి కెమెరాను జూమ్ చేయగా, అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు కార్లు బారులు తీరి నెమ్మదిగా కదులుతున్న దృశ్యం కనిపించింది.

ఆ నివాస సముదాయంలోని ప్రజలు ప్రధాన రహదారిపైకి రాకముందే సొంత కాంప్లెక్స్‌లోనే ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటున్నారని, గేటు దాటడానికి వారికి దాదాపు అరగంట పడుతోందని ఆమె వీడియోలో వివరించారు. అపార్ట్‌మెంట్ లోపల కూడా ఈ స్థాయిలో ట్రాఫిక్ ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది. పరిమిత ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లతో భారీ నివాస ప్రాజెక్టులను నిర్మించడమే ఇటువంటి సమస్యలకు కారణమని పలువురు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సాధారణంగా జంక్షన్లు, ప్రధాన రహదారులకే పరిమితమయ్యే ట్రాఫిక్ కష్టాలు.. ఇప్పుడు నగరవాసుల ఇంటి గుమ్మం వద్దకే చేరాయని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఇది బెంగళూరు నగర ప్రణాళిక, మౌలిక వసతులపై మరోసారి చర్చకు కార‌ణ‌మైంది.
Advertisement
Bengaluru Traffic
Varthur Bengaluru
Apartment Traffic Jam
Bengaluru Infrastructure
Viral Video
Urban Planning

More Telugu News