హర్మూజ్‌ తెరుచుకుంది.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గుతాయా?

Strait of Hormuz opens will petrol and diesel prices decrease
  • అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం
  • అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చిన చమురు ధరలు
  • అయినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం లేదు
  • గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోసమేనని నిపుణులు విశ్లేషణ
  • ఎల్‌పీజీ విషయంలోనూ ఇదే పరిస్థితి
ఇరాన్‌, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఒప్పందంలో  భాగంగా హర్మూజ్‌ జలసంధిని తెరవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలు తగ్గుతాయా అనే చర్చ మొదలైంది.

ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన దేశంలో వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గవని నిపుణులు చెబుతున్నారు. చమురు మార్కెటింగ్‌ సంస్థలు గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునే ప్రక్రియలో ఉన్నాయి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కొంతకాలం స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగితేనే వినియోగదారులకు ప్రయోజనం కనిపించే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం ఒకవేళ ధరలు తగ్గించినా లీటర్‌కు రూ.2 నుంచి రూ.4 వరకు మాత్రమే దిగొచ్చే అవకాశముంది.

ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని వర్గాలకు సబ్సిడీలు అందిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్‌, చమురు ధరలు మరింత తగ్గితే ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుంది. అప్పుడు ధరల విషయంలో కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అది అందరికీ ఒకేలా వర్తిస్తుందని చెప్పలేం.

అయితే హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకోవడం భారత్‌కు మాత్రం సానుకూల పరిణామమే. ఎందుకంటే దేశం అవసరమైన చమురులో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు ధరలు నియంత్రణలో ఉంటే దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణంపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించే అవకాశం ఉంది.
Go Back to Shorts
Strait of Hormuz
Donald Trump
Petrol diesel prices
Iran US peace deal
Crude oil prices
Fuel price reduction

More Telugu News