తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద అందిస్తున్న రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే వినియోగదారులు తమ ఆధార్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ శనివారం జీవో 19ను విడుదల చేసింది.

పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు, అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందేలా చూడటమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఆధార్ వివరాలను వారి ఆహార భద్రత (రేషన్) కార్డులతో అనుసంధానించాలని నిర్ణయించారు.

ఆధార్ నంబరు లేనివారు కూడా ఈ పథకానికి అర్హులే. వారు ఆధార్ కోసం నమోదు చేసుకున్న రసీదుతో పాటు ప్రభుత్వం సూచించిన ఇతర గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి చూపించి ప్రయోజనం పొందవచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, ఓటరు ఐడీ, ఉపాధి హామీ కార్డు వంటివి సమర్పించాల్సి ఉంటుంది.

ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియలో వేలిముద్రలు సరిపోలని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం సూచించింది. అలాంటి వారు ఐరిస్ (కంటిపాప) లేదా ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఈ పద్ధతులు కూడా విఫలమైతే, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ లేదా టైమ్ ఆధారిత ఓటీపీని ఉపయోగించుకోవచ్చు. అన్ని పద్ధతులు విఫలమైన అత్యవసర పరిస్థితుల్లో, ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలను ధ్రువీకరించే ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా ఏ ఒక్క అర్హుడు కూడా పథకానికి దూరం కాకుండా చూడాలని ఆదేశించింది.