తమిళనాడులోని తిరుపరంకుండ్రం దీపస్తంభం వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి చూపించాలనుకునే కుట్రలకు, తిరుపరంకుండ్రం దీపస్తంభం వద్ద పవిత్ర కార్తీక దీపం వెలిగించడమే సరైన సమాధానమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పలు అంశాలను ప్రస్తావిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయడం, ఆలయ బోర్డును రద్దు చేయడం, అలాగే కొండ భద్రతను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు అప్పగించడం ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కారానికి పాల్పడిన టీవీకే ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.

హిందూ సంప్రదాయాలకు, సనాతన ధర్మానికి ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించిన విజయ్ ప్రభుత్వం, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. కోట్లాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు, హిందూ సమాజానికి, అలాగే భారత రాజ్యాంగానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో భక్తుల హక్కుల పరిరక్షణకు, సనాతన ధర్మానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, న్యాయపోరాటం చేసిన న్యాయవాదుల బృందానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చివరగా "వెట్రివేల్ మురుగనుక్కు అరోహరా!" అంటూ ఆయన తన పోస్టును ముగించారు.