డీలిమిటేషన్ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... రాబోయే డీలిమిటేషన్‌కు సంబంధించి పార్లమెంట్‌లో డిసెంబర్ నాటికి బిల్లు ఆమోదం పొందకపోతే, ఆ తర్వాత సీట్ల పెంపు ప్రక్రియను జనాభాకు అనుగుణంగానే చేపట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఉత్తరాది ప్రజలు తమ జనాభా నిష్పత్తి ప్రకారమే డీలిమిటేషన్ చేయాలని ఆందోళనలు ప్రారంభిస్తే పరిస్థితి ఏంటని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రస్తుతం కొందరు దక్షిణాది, ఉత్తరాది అంటూ ప్రాంతీయ విభేదాలు, తారతమ్యాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి ఒకే ఎంపీ ఉన్న పరిస్థితులను కూడా గమనించాలని సూచించారు.

జీడీపీని ప్రాతిపదికగా తీసుకుని ఎంపీ సీట్లను పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతిపాదనను లక్ష్మణ్ ప్రశ్నించారు. జీడీపీ అనేది ప్రతి ఏటా మారుతూ ఉంటుందని, అలాంటప్పుడు ఎంపీ సీట్లను కూడా ప్రతి సంవత్సరం పెంచడం లేదా తగ్గించడం సాధ్యమేనా అని నిలదీశారు. సాధారణంగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుందని గుర్తుచేశారు.

నియోజకవర్గాల సంఖ్య పెరిగితే చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం, రిజర్వ్‌డ్ స్థానాలు పెరుగుతాయని... తద్వారా ఆయా వర్గాల గొంతు మరింత బలంగా వినిపిస్తుందని లక్ష్మణ్ వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో అడ్డుకున్న కాంగ్రెస్, వామపక్షాలు, మమతా బెనర్జీలకు ప్రజలు ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.