ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రజల సందర్శనార్థం తెరిచింది. బీజేపీ ‘శీష్ మహల్’గా పిలిచే ఈ భవనంలోకి సామాన్య ప్రజలు, మీడియా ప్రతినిధులను అనుమతించి, అక్కడ జరిగిన ఆధునికీకరణ ఖర్చులు, విలాసవంతమైన వస్తువుల ధరల వివరాలను బహిర్గతం చేసింది.

ఈ భవనం వెలుపల ఏర్పాటు చేసిన పెద్ద బోర్డుపై మొత్తం పునరుద్ధరణ వ్యయాన్ని రూ.58,83,66,314 (సుమారు రూ. 58.83 కోట్లు)గా పేర్కొన్నారు. లోపల అమర్చిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, అలంకరణ వస్తువుల ధరలను ప్రత్యేక డిస్‌ప్లేల ద్వారా ప్రదర్శించారు. అందులో రూ. 11 లక్షల ఖరీదైన షాండ్లియర్లు (దీప గుచ్చాలు), రూ.5,69,162 ఖరీదైన కర్టెన్లు, రూ.5,58,885 విలువైన డైనింగ్ టేబుల్-కుర్చీలు, రూ.10 లక్షల రౌండ్ సైడ్ టేబుళ్లు, రూ.1,96,482 డబుల్ బెడ్లు, రూ.3,34,484 కన్సోల్ యూనిట్లు ఉన్నాయి. పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఏ విధంగా ఖర్చయిందో ప్రజలకు పారదర్శకంగా చూపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ మాట్లాడుతూ.. కారు, బంగ్లా తీసుకోనని, కేవలం రెండు గదుల ఇల్లు చాలని చెప్పిన వ్యక్తి నివాసం కోసం ప్రారంభంలో రూ.8 కోట్ల బడ్జెట్ అనుకుని చివరకు రూ.58 కోట్లకు పైగా ఖర్చు చేశారని విమర్శించారు. మరో మంత్రి కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంటే కేజ్రీవాల్ ఈ ‘శీష్ మహల్’ కట్టారని ఆరోపించారు. వియత్నాం నుంచి మార్బుల్, ఇతర దేశాల నుంచి ఆటోమేటిక్ లిఫ్టులు, క్రాకరీ, టేబుళ్లు, రూ.11 లక్షల విలువైన షాండ్లియర్లు తెప్పించి విలాసవంతంగా తీర్చిదిద్దారని మండిపడ్డారు.