పార్లమెంటు సమావేశాలు నవంబరు 30 నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ స్వల్పకాలిక భేటీల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం మరోసారి తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అయితే, లోక్‌సభలో ఈ కీలక బిల్లు నెగ్గడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం ఎన్డీయే కూటమికి అతిపెద్ద సవాలుగా మారింది.

ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540. ముగ్గురు ఎంపీల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరై ఓటు వేసే సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు తప్పనిసరి. సభలో ఉన్న 540 మంది సభ్యులూ ఓటింగ్‌లో పాల్గొంటే బిల్లు నెగ్గడానికి కనీసం 360 మంది మద్దతు అవసరం అవుతుంది.

ఎన్డీయే చేతిలో ఉన్న 320 మంది..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 320 మంది ఎంపీల మద్దతు ఉంది. బీజేపీకి చెందిన ఎంపీలు 241 మంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు చేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ NCPI)లో విలీనమైన 20 మంది రెబల్ ఎంపీలు ఇప్పటికే ఎన్డీయే పక్షాన నిలిచారు. మహారాష్ట్ర నుంచి ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 13 మంది ఎంపీలు కూటమిలోనే కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ (16), జేడీయూ (12), ఎల్జేపీ-రామ్ విలాస్ (5), ఆర్‌ఎల్‌డీ (2), జనసేన (2), జేడీఎస్ (2) తో పాటు ఇతర చిన్న పార్టీల ఎంపీలు కలిపి ఎన్డీయే బలం 320కి చేరింది. శివసేనతో పాటు టీఎంసీ తిరుగుబాటు ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ 360ని అందుకోవడానికి ఎన్డీయేకు ఇంకా 40 ఓట్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

ఎన్డీయే ముందున్న 3 ప్రధాన సమీకరణాలు:

మొదటి సమీకరణం (మూడు పార్టీల మద్దతు లభిస్తే): డీఎంకే (22), ఎన్సీపీ-ఎస్పీ (8), వైసీపీ (4) మొత్తం 34 మంది సభ్యులు బిల్లుకు మద్దతు ఇచ్చినా కూటమి బలం 354కి మాత్రమే చేరుతుంది. సభలోని 540 మంది ఓటు వేస్తే.. అప్పటికీ ప్రభుత్వానికి మరో 6 ఓట్ల లోటు మిగిలే ఉంటుంది.

రెండో సమీకరణం (డీఎంకే సభకు రాకుండా దూరంగా ఉంటే): డీఎంకేకు చెందిన 22 మంది సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరై, ఎన్సీపీ, వైసీపీలు మద్దతు ఇస్తే ఎన్డీయే బలం 332కి చేరుతుంది. సభలో ఓటు వేసే వారి సంఖ్య 518కి తగ్గుతుంది. అప్పుడు కావాల్సిన మెజారిటీ 346 అవుతుంది. ఈ సందర్భంలోనూ ప్రభుత్వానికి ఇంకా 14 ఓట్లు అవసరమవుతాయి.

మూడో సమీకరణం (డీఎంకే, ఎన్సీపీ దూరంగా ఉంటే): ఈ రెండు పార్టీల నుంచి 30 మంది గైర్హాజరై, వైసీపీ ఒక్కటే మద్దతు ఇస్తే ఎన్డీయే బలం 324 అవుతుంది. అప్పుడు ఓటు వేసే సభ్యుల సంఖ్య 510కి పడిపోతుంది. బిల్లు పాస్ కావడానికి 340 ఓట్లు అవసరం. అయినా కూటమికి మరో 16 ఓట్లు తగ్గుతాయి.

గతంలో ఏప్రిల్ 17న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చినప్పుడు సభలో ఓడిపోయింది. అప్పుడు ఓటింగ్‌లో పాల్గొన్న 528 మందిలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అవసరమైన 352 ఓట్లలో 54 ఓట్ల కొరతతో బిల్లు వీగిపోయింది. ఇప్పుడు మరోసారి ఈ బిల్లు తెరపైకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ప్రాంతీయ పార్టీల నుంచి అదనపు ఓట్లు సాధిస్తారా? లేక విపక్ష సభ్యులను ఓటింగ్‌కు దూరం ఉంచి గట్టెక్కుతారా? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.