కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఈ పరిణామంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచే బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు, ముందస్తు అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, శ్రవణ్ కుమార్ సహా పలువురు నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. తాము ఎలాంటి ధర్నాలు లేదా ఆందోళనలు నిర్వహించేందుకు వెళ్లడం లేదని, చట్టబద్ధంగా కేఆర్‌ఎంబీకి వినతిపత్రం సమర్పించేందుకు మాత్రమే సిద్ధమయ్యామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులను ఏ కారణంతో నిర్బంధిస్తున్నారో రాష్ట్ర డీజీపీ తక్షణమే ప్రజలకు, పార్టీకి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అనుమతులు లేకుండానే నాగార్జునసాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల హైదరాబాద్‌ నగరంతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు భవిష్యత్తులో తాగు, సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. తాగునీటి పేరుతో నీటిని తరలిస్తూ హైదరాబాద్ భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. కాగా, ఈ అరెస్టులకు గల కారణాలపై పోలీసు లేదా ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.