ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నిరంతర కృషితో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగంగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

శనివారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ 'కియా' తమ కార్యకలాపాలను విస్తరించేందుకు రాష్ట్రంలో మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని ఆయన వెల్లడించారు. దీనితో పాటు ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు ప్రాజెక్టు పనులు కూడా పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ప్రభుత్వం ప్రారంభించిందని, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా ఏపీకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

గతంలో జరిగిన పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నాటికి రాష్ట్రానికి రూ. 22.60 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందాయని టీజీ భరత్ గుర్తుచేశారు. వీటిలో రూ. 17 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రతిపాదనలు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) జారీ దశకు చేరుకున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.