ఆసియా కప్ రైజింగ్ స్టార్ టోర్నీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఆ మ్యాచ్‌కు ముందు తీవ్ర ఆందోళనలో ఉన్నాడట. ఈ విషయాన్ని అతని ప్రాణస్నేహితుడు, భిలాయ్‌కి చెందిన యువ క్రికెటర్ ప్రథమ్ జాచక్ తాజాగా వెల్లడించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ వేడుకలో వైభవ్ మాట్లాడాడు. మ్యాచ్‌కు ముందు తాను నలుగురితోనే మాట్లాడానని వైభవ్ చెప్పాడు. అందులో తన తండ్రి, చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా, మెంటార్ యువరాజ్ సింగ్‌లతో పాటు స్నేహితుడు ప్రథమ్ జాచక్ ఉన్నారు.

మ్యాచ్‌కు ముందు వైభవ్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. టోర్నీలో గత మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేకపోయాడు. "నేను ఏం చేయాలి? పరుగులు రావడం లేదు" అంటూ ప్రథమ్‌తో ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు ప్రథమ్ అతనికి ధైర్యం చెప్పాడు. "తర్వాతి మ్యాచ్‌లో నువ్వు ఒక్కడివే పరుగులు సాధిస్తావు" అని భరోసా ఇచ్చాడు. ఆ మాటలు నిజమయ్యాయి. వైభవ్ పరుగుల సునామీ సృష్టించాడు. చరిత్ర తిరగరాసిన వెంటనే వైభవ్ మళ్లీ ఫోన్ చేసి మాట్లాడాడు. "నువ్వు అనుకున్నది సాధించావు" అంటూ ప్రథమ్ అతడిని అభినందించాడు.

అండర్-19 రోజుల్లో ఇద్దరూ ఒకే హోటల్ గదిని పంచుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వయసులో ప్రథమ్ ఐదేళ్లు పెద్దవాడు. ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. మైదానంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి ఈ స్నేహం ఎంతగానో తోడ్పడుతోంది. ఇప్పటివరకు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లలేదు. త్వరలోనే భిలాయ్ వస్తానని వైభవ్ మాటిచ్చాడు. భవిష్యత్తులో సమస్తిపూర్ గ్రామానికి వెళతానని ప్రథమ్ చెప్పాడు.