ఆంధ్రప్రదేశ్‌ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. పరిపాలనలో ప్రజలను ప్రత్యక్ష భాగస్వాములను చేసే దిశగా 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ అనే నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై ఎక్కడైనా గుంతలు కనిపిస్తే, ప్రజలు వాటిని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి నివేదించవచ్చు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేస్తారు.

ఈ మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు తమ పరిధిలోని రహదారులపై గల గుంతలను ఫొటో తీసి, 9552300009 అనే 'మనమిత్ర' వాట్సాప్ నంబర్‌కు పంపాలని సూచించింది. ఫిర్యాదు చేసేందుకు తొలుత ఈ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపి, అక్కడ లభించే సూచనలను అనుసరించాలి. ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేసిన అనంతరం, గుంత ఉన్న ప్రదేశం కరెంట్ లొకేషన్‌ను ఫొటోతో పాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఆర్టీజీఎస్ తక్షణమే పరిశీలిస్తుంది. ఫొటో, లొకేషన్ ఆధారంగా సదరు రహదారి ఏ శాఖ (పంచాయతీరాజ్, పురపాలక, ఆర్‌అండ్‌బీ, లేదా జాతీయ రహదారులు) పరిధిలోకి వస్తుందో గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తుంది. తద్వారా అధికారులు త్వరితగతిన గుంతల పూడ్చివేత పనులు చేపడతారు. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత దాని స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.

ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమ పరిసరాల్లో రోడ్లపై గుంతలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా, తక్షణమే 'మనమిత్ర' ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కోరింది.