ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఏర్పాటై 222 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే స్థానిక బార్ అసోసియేషన్ 131 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం 9.30 గంటలకు అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. ఉదయం 10.00 గంటలకు ఆయన రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10.15 గంటలకు మంజీరా సరోవర్ ప్రీమియర్ హోటల్‌కు చేరుకుంటారు.

మంజీరా సరోవర్ ప్రీమియర్ హోటల్ వేదికగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.05 గంటల వరకు నిర్వహించే జిల్లా కోర్టు 222 ఏళ్లు, బార్ అసోసియేషన్ 131 ఏళ్ల సంయుక్త వార్షికోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ విశిష్టత, జిల్లా కోర్టు మరియు బార్ అసోసియేషన్ అందించిన సేవలను ఆయన ప్రస్తావించనున్నారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం, మధ్యాహ్నం రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి 1.45 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో స్థానిక యంత్రాంగం, పోలీసు విభాగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాయి.

స్వాతంత్రానికి పూర్వం, మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో 1804లో రాజమహేంద్రవరంలో జిల్లా కోర్టు ఏర్పాటు చేశారు. 1895లో బార్ అసోసియేషన్ ఏర్పడింది. ఆ తర్వాత 1925లో గోదావరి జిల్లా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విడిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఏర్పాటైనప్పటికీ, జిల్లా కోర్టు మాత్రం రాజమహేంద్రవరంలోనే కొనసాగుతోంది.