ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న అలర్జీలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఒక కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దశాబ్దాలుగా అలర్జీలు అంటే రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్లే వస్తాయని, దాని ప్రభావంతో శరీర రక్షణ కవచాలు దెబ్బతింటాయని భావిస్తూ వచ్చారు. అయితే, ఈ ప్రక్రియ అంతకంటే ముందే కణాల స్థాయిలో మొదలవుతోందని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. గ్రిఫిత్ యూనివర్సిటీ ఆధారంగా సైన్స్ డైలీ ప్రచురించిన తాజా కథనం ప్రకారం.. అలర్జీలు ప్రారంభం కావడానికి కణాల్లోని శక్తి లోపమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు సరికొత్త ‘బయోఎనర్జెటిక్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ప్రఖ్యాత క్లినికల్ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ పీటర్ స్మిత్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. చర్మం, అన్నవాహిక, శ్వాసకోశ వ్యవస్థ, పేగులు వంటి భాగాల్లో ఉండే ఎపిథీలియల్ కణాలు శరీరానికి ఒక రక్షణ గోడలా పనిచేస్తాయి. వీటికి అవసరమైన శక్తిని కణాల్లోని మైటోకాండ్రియా అందిస్తుంది. అయితే, మైటోకాండ్రియా సరిపడా శక్తిని ఉత్పత్తి చేయలేక ‘పవర్ ఫెయిల్యూర్’ పరిస్థితులు తలెత్తినప్పుడు, ఆ కణాలు బయటి ఒత్తిళ్లను తట్టుకోలేక త్వరగా ప్రభావితమవుతాయి. ఫలితంగా ఎగ్జిమా, ఆహార అలర్జీలు, ఆస్తమా, హే ఫీవర్ వంటి సమస్యలు బయటపడతాయని పరిశోధకులు వివరించారు.

ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు దాదాపు 116 గ్రూపులకు చెందిన 3,776 మంది రోగుల సమాచారాన్ని, మల్టీ-ఓమిక్స్ డేటాను విశ్లేషించారు. ముఖ్యంగా అన్నవాహిక వాపుతో కూడిన ‘ఇసినోఫిలిక్ ఎసోఫాగిటిస్’ సమస్య ఉన్న రోగుల్లో పాడైపోయిన మైటోకాండ్రియాను తొలగించే ప్రక్రియ మందగించినట్లు గుర్తించారు. అలాగే ఎగ్జిమా రోగుల్లో వాపు కనిపించని ఆరోగ్యకరమైన చర్మంపై కూడా రక్షణ పొర బలహీనపడటం, యాంటీఆక్సిడెంట్ రక్షణ తగ్గడం వంటి అంశాలను గమనించారు.

మారిన ఆధునిక జీవనశైలి, ప్రాసెస్ చేసిన ఆహారాలు, వాయు కాలుష్యం, మైక్రోప్లాస్టిక్స్, డిటర్జెంట్లు, చిన్నతనంలోనే యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వంటి అంశాలు కణాల శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అలర్జీ మందులు ఎక్కువగా సమస్య ముదిరిన తర్వాత ఇచ్చేవే కావడంతో, మందులు ఆపగానే లక్షణాలు మళ్లీ తిరగబెడుతున్నాయని తెలిపారు.

ఈ పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘అలర్జీ’లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఇది ఒక బలమైన ప్రతిపాదనగా ఉందని, భవిష్యత్తులో చిన్నారులపై మరింత లోతైన పరిశోధనలు జరిపితే అలర్జీల మూలాలను పూర్తిగా నియంత్రించే సరికొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు.