ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ప్రధాన పాత్రలో దర్శకుడు మనోజ్ ఎన్ఎస్ తెరకెక్కించిన తాజా కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'మూన్‌వాక్'. శుక్రవారం ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వినోదం, సంగీతం, డ్యాన్స్ ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ ట్రైలర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రంలో నటుడిగా కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

ఈ సినిమాలో ప్రభుదేవా 'బబూటీ' అనే వినూత్నమైన పాత్రను పోషించారు. కథలో భాగంగా ఆయన జీవితంలో నగ్మా, స్మిత అనే ఇద్దరు మహిళలు, ఒక స్నేహితుడు, విచిత్ర ప్రవర్తన కలిగిన మామగారు ఉంటారని ట్రైలర్ ద్వారా చూపించారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రంలో కోపిష్టి ఫిల్మ్ డైరెక్టర్ పాత్రలో అతిథిగా మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు ఈ చిత్రంలో అత్త, మామ పాత్రలతో పాటు ఏకంగా 16 విభిన్న గెటప్పుల్లో కనిపించి అలరించనున్నారు. అంతేకాకుండా ప్రభుదేవా మార్క్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ప్రభుదేవా స్పందించారు. "సుమారు 30 సంవత్సరాల తర్వాత నేనూ, ఏఆర్ రెహమాన్ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం కోసం మళ్లీ కలిశాం. 'మూన్‌వాక్' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సెలవుల్లో కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమా" అని ఆయన పేర్కొన్నారు.

బిహైండ్‌వుడ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ ఎన్ఎస్, దివ్య మనోజ్, ప్రవీణ్ ఎలక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అజు వర్గీస్, అర్జున్ అశోకన్, సాట్జ్, నిష్మా, సుస్మిత, రెడిన్ కింగ్స్లీ, మొట్టై రాజేంద్రన్, లొల్లు సభ స్వామినాథన్, డాక్టర్ సంతోష్ జాకబ్, దీప శంకర్, రామ్‌కుమార్ నటరాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా, అనూప్ వి. శైలజ సినిమాటోగ్రఫీ అందించారు. శేఖర్ విజే, పీయూష్ షాజియా కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.

వాస్తవానికి ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రోమియో పిక్చర్స్ సంస్థ వరల్డ్‌వైడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోగా, లహరి మ్యూజిక్ సంస్థ ఆడియో హక్కులను దక్కించుకుంది.