న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తొలి టెస్టులోనే కాకుండా రెండో మ్యాచ్‌లోనూ సిరాజ్‌ను పక్కన పెట్టడంపై భారత మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ అంశంపై అశ్విన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా వ్యంగ్యంగా స్పందించాడు. "ఆకాశ్ దీప్ ఈరోజు అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే, సిరాజ్ మాత్రం తన బౌలింగ్ పదును కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. అతడు కష్టపడి ప్రాక్టీస్ చేసి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాటికి పుంజుకుంటాడని ఆశిస్తున్నా" అని అశ్విన్ పరోక్షంగా చురకలంటించారు. అంతేకాకుండా, "60 నుంచి 80 ఓవర్ల సమయం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది, సిరాజ్ గట్టిగా పరిగెత్తి బౌలింగ్ చేసి ఒకటి రెండు వికెట్లు తీస్తే బాగుణ్ణు" అంటూ జట్టు నిర్ణయాన్ని ఎద్దేవా చేశాడు.

మరోవైపు మహమ్మద్ కైఫ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. "భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్ అయిన సిరాజ్‌ను మళ్లీ పక్కన పెట్టడం నమ్మశక్యంగా లేదు. విదేశీ టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రాతో పాటు జట్టులో ముందుగా పరిగణించాల్సిన పేర్లలో సిరాజ్ ఒకడు. సిరాజ్ వరల్డ్ క్లాస్ బౌలర్ అని, చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని స్వయంగా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ చెప్పినప్పుడు అతడిని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు?" అని కైఫ్ ప్రశ్నించాడు.

ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో 11 మ్యాచ్‌లలో 43 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా ఉన్న సిరాజ్‌కు మొండిచేయి చూపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.