అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, రాజధాని అమరావతి పనులు, విద్యుత్ రంగాభివృద్ధి, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సంబంధించి దాదాపు 30 అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేబినెట్ ఆమోదించిన నిర్ణయాల పూర్తి వివరాలు:
పారిశ్రామిక రంగం-పెట్టుబడులు: 
ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026: పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే జాప్యాన్ని నివారించేందుకు నూతన బిల్లుకు ఆమోదం. 
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు: సీఐఐ భాగస్వామ్య సదస్సుల ద్వారా వచ్చిన 6 దిగ్గజ కంపెనీల ప్రతిపాదనలకు పచ్చజెండా. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
కియా రెండో ప్లాంట్: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వద్ద రూ.19,000 కోట్ల పెట్టుబడితో కియా రెండో ఆటోమొబైల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు అనుమతి. 
అదానీ టైటానియం కాంప్లెక్స్: శ్రీకాకుళం జిల్లాలో రూ.13,667 కోట్ల వ్యయంతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ స్థాపనకు ఆమోదం. 
సెయింట్-గోబైన్ ఫ్లోట్ గ్లాస్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.1,800 కోట్లతో ఫ్లోట్ గ్లాస్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేబినెట్ క్లియరెన్స్.

అమరావతి రాజధాని పనులు
ప్రధాన భవనాల నిర్మాణం: అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించి నిధుల కేటాయింపు.
సచివాలయ వ్యయం పెంపు: సమీకృత సచివాలయం, విభాగాధిపతుల (HoD) కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు సవరిస్తూ నిర్ణయం. 
గ్రామాల అభివృద్ధి: రాజధాని పరిధిలోని స్థానిక గ్రామాల మౌలిక వసతుల పనుల కోసం రూ.1,215 కోట్లు మంజూరు.
అమరావతి సంగమం: శాఖమూరు వద్ద పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా ‘అమరావతి సంగమం’ నిర్మాణానికి రూ.626 కోట్లు ఖరారు. 
గ్రీన్ వర్క్స్: రాజధాని పరిధిలో గ్రీన్ వర్క్స్ ప్యాకేజీ-2 పనుల కోసం రూ.180.68 కోట్లకు పరిపాలనా అనుమతులు.

విద్యుత్, పునరుత్పాదక ఇంధనం
ఏపీజెన్‌కో - కోల్ ఇండియా జేవీ: రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చేందుకు కోల్ ఇండియాతో కలిసి ఏపీజెన్‌కో సంయుక్త భాగస్వామ్యం (JV) ఏర్పాటుకు అనుమతి.
మైలవరం సోలార్ ప్లాంట్: వైఎస్సార్ కడప జిల్లా మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం 1,127 ఎకరాల భూమి కేటాయింపు. 
పవన విద్యుత్ ప్రాజెక్టు: నంద్యాల జిల్లాలో 210 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు బదిలీ ప్రక్రియకు కేబినెట్ ఆమోదం. 
బయోగ్యాస్ ప్లాంట్: ప్రకాశం జిల్లాలో రోజుకు 12 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం.

రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారం
నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు: అనంతపురం జిల్లాలో 9,917 ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనివల్ల 4,352 మంది రైతులకు (పట్టాదారులకు) ఊరట లభించింది.
వెబ్‌ల్యాండ్ రికార్డుల సవరణ: రైల్వేకోడూరు పరిధిలోని 10,192 ఎకరాల భూములకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ రికార్డుల తప్పులను సరిదిద్దేందుకు అనుమతి. 
హక్కులపై స్పష్టత: భూ వివాదాలను పరిష్కరించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ, అసైన్డ్, వివాదాస్పద భూములపై ఎవరికీ కొత్తగా ఎలాంటి హక్కులు కల్పించకూడదని కేబినెట్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రానికి భారీ పరిశ్రమలను రప్పించడంతో పాటు, రాజధాని పనులను పరుగులు పెట్టించేలా, సామాన్యుల భూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేలా మంత్రివర్గం సమగ్రమైన కార్యాచరణను ఖరారు చేసింది.