ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. పాల్వంచలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘నవ లిమిటెడ్’ యాజమాన్యం ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వచ్చారు. అక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

పాల్వంచ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలకగా, దంపతులిద్దరూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులకు చంద్రబాబు అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.