ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించాలని ఫ్రాంచైజీ నిర్ణయించగా, అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్‌గా) వ్యవహరించాలంటూ వచ్చిన ఆఫర్‌ను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఇండియా టుడే కథనం ప్రకారం... అక్టోబర్ మొదటి వారంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యం బుమ్రాను సంప్రదించింది. రాబోయే 2027 ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను బుమ్రా మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల నిర్దిష్ట కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు శాశ్వత వైస్ కెప్టెన్ ఎవరూ లేరు. గతంలో హార్దిక్ పాండ్యా అందుబాటులో లేని సమయాల్లో బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ బాధ్యతలను పంచుకున్నారు. అయితే రాబోయే సీజన్ కోసం రోహిత్ చుట్టూనే నాయకత్వ విభాగాన్ని బలోపేతం చేయాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బుమ్రాకు డిప్యూటీ పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం.

జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకరైన బుమ్రా వైస్ కెప్టెన్సీని వద్దనుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు ప్రధాన పేసర్‌గా ఇప్పటికే ఎంతో అనుభవం ఉన్న బుమ్రా, అదనపు బాధ్యతల కంటే తన బౌలింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టాలని భావిస్తున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోవైపు, ఈ నిర్ణయం 2028 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌తో బుమ్రా అనుబంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.