ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బోణీ కొట్టింది. దుప్పలపూడి పంచాయతీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు రెండు వార్డు స్థానాలను కైవసం చేసుకుని విజయం సాధించారు. జాతీయ స్థాయిలో విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ఆప్‌కు ఈ ఫలితాలు ఏపీలో సరికొత్త ఉత్సాహాన్ని అందించాయి.

దుప్పలపూడి పంచాయతీ ఎన్నికల్లో ఆప్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు స్థానికంగా ప్రభావం చూపారు. 3వ వార్డు నుంచి పోటీ చేసిన కొల్లాపు లక్ష్మణ్ ప్రత్యర్థులపై విజయం సాధించగా, 6వ వార్డులో పోటీ చేసిన తంగుడు దుర్గ గెలుపొందారు. తమ అభ్యర్థులు విజయం సాధించడంతో స్థానిక ఆప్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ విజయంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది తమ పార్టీకి చారిత్రక విజయమని పార్టీ పేర్కొంది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు కొల్లాపు లక్ష్మణ్, తంగుడు దుర్గలకు నాయకత్వం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసింది. తమ అభ్యర్థులను ఆదరించి గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఆప్ ధన్యవాదాలు తెలిపింది. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.