ప్రేమకథలకు యూత్ నుంచి విపరీతమైన సపోర్టు లభిస్తూ ఉంటుంది. ఫీల్ గుడ్ లవ్ మూవీస్ చాలా ఫాస్టుగా సక్సెస్ దిశగా పరిగెడుతూ ఉంటాయి. కంటెంట్ ఏ మాత్రం యూత్ కి కనెక్ట్ అయినా భాషతో సంబంధం లేకుండా భారీ విజయాలను రాబడుతూ ఉంటాయి. అలాంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన సినిమానే 'హైకూ'. ఏగన్ .. శ్రీదేవి .. ఫెమీనా జార్జ్  ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అక్టోబర్ 23వ తేదీన థియేటర్లకు వచ్చింది.  ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

మనోహర్ (ఏగన్) కోయంబత్తూర్ లోని ఒక కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి 'కొడి' ( శ్రీదేవి) పరిచయమవుతుంది. ఆమె ఓ శ్రీమంతుడి కూతురు. ఆమె తండ్రికి కులం పట్టింపు ఎక్కువ. సాధ్యమైనంతవరకూ ఎవరినీ ఇంటికి కూడా రానీయడు. అలాంటి ఆయన కూతురు. 'మనో'తో ప్రేమలో పడుతుంది. ఆమె అక్కయ్యతో మాట్లాడిన మనోకి, తాను మంచి జాబ్ కొట్టకపోతే తమ ప్రేమ సక్సెస్ కాదనే విషయం అర్థమవుతుంది. దాంతో అతను చెన్నై బాట పడతాడు. 

మనో కెరియర్ పరంగా ఎదగడానికి ట్రై చేస్తూ ఉండగా, 'కొడి'తో దూరం పెరగడం మొదలవుతుంది. ఒకానొక సమయంలో మనో ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ సమయంలోనే అతనికి 'నివేద'( ఫెమీనా జార్జ్) పరిచయమవుతుంది. తన ఆఫీస్ లోనే పనిచేస్తున్న నివేద, బాయ్ ఫ్రెండ్ 'అరుళ్'తో ఇబ్బంది పడుతుందనే విషయం మనోకి అర్థమవుతుంది. మనో కారణంగానే ఆమెకి అరుళ్ నుంచి విముక్తి కలుగుతుంది. అప్పటి నుంచి ఆమె మనోను లవ్ చేయడం మొదలుపెడుతుంది. 

ఈ నేపథ్యంలోనే నివేదకి ఒక విషయం అర్థమవుతుంది .. తాను ఎంతగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ అతను ఇంకా 'కొడి'ని మరిచిపోలేదని. 'కొడి' అంతగా అతనిని ఎలా ప్రభావితం చేసిందనేది ఆమెకి అర్థం కాదు. అంతగా ప్రేమించిన వ్యక్తికి 'కొడి' ఎందుకు దూరమయ్యాడో .. అందుకుగల కారణాలేవిటో తెలుసుకోవాలని నివేద భావిస్తుంది. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమెకి తెలిసే నిజాలేమిటి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేదే కథ.

ప్రేమకథలు ఎన్ని వచ్చినప్పటికీ, ప్రతి ప్రేమకథ కొత్తగానే అనిపిస్తుంటుంది. అదే ప్రేమకి ఉన్న ప్రత్యేకత. డబ్బు .. కులం .. చదువు .. ఈ విషయాల్లోని అంతరాలు ప్రేమకి అడ్డుగోడలుగా మారిపోతూ ఉంటాయి. హీరోయిన్ ప్రేమ కోసం తపించే హీరో పాలిట ఆమె తండ్రి విలన్ గా మారిపోతూ ఉంటాడు. అలా చూసుకుంటే ఈ సినిమా దర్శకుడు అక్కడక్కడా కాస్త రొటీన్ కి భిన్నంగానే ఆలోచించాడని చెప్పుకోవాలి.

'హైకూ' రెండు ప్రేమకథల సమ్మేళనం అని చెప్పాలి. కథానాయకుడు ఒకరే .. నాయికలు మాత్రం ఇద్దరు. ఈ ఇద్దరు అమ్మాయిలు ఒక ప్రేమికుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారనేదే ప్రధానమైన కథాంశం. ఫస్టాఫ్ లో హీరో జీవితం 'కొడి'తో ముడిపడి సాగుతుంది. సెకండాఫ్ అంతా నివేదతో అతను సాగించే ప్రయాణంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు అమ్మాయిల స్వభావంలోని వైవిధ్యమే ఈ కథకు పునాదిగా కనిపిస్తుంది.

ఈ కథలో ఎక్కడా కూడా ఫన్ కనిపించదు. అయితే కథకి అవసరమైన కామెడీనీ వర్కౌట్ చేసే ఛాన్స్ ఫస్టాఫ్ లో కనిపిస్తుంది. అమ్మాయిలందరి మధ్య హీరో ఫేస్ చేసే ప్రొబ్లమ్స్ ను వినోదభరితంగా చూపించవచ్చు. కానీ ఆ దిశగా డిజైన్ చేసుకోకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. ఇక ఎమోషన్స్ ను పండించడానికి దర్శకుడు కొంతవరకూ ప్రయత్నించాడు గానీ, పెద్దగా వర్కౌట్ కాలేదనే అనిపిస్తుంది.  

సాధారణంగా హీరో - హీరోయిన్ ప్రేమ విషయంలో ఆమె తండ్రి విలన్ గా మారిపోయి రంగంలోకి దిగడం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక షేడ్ దగ్గరికి వెళుతూనే కథను మరో వైపుకు తిప్పడం, కొత్తదనం కోసం దర్శకుడు చేసిన ప్రయత్నంగా అనిపిస్తుంది. అమ్మాయిల హృదయాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదనే ఒక స్థితిలో హీరోను నిలబెట్టేసిన తీరు, సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. అలాగే మనోకి 'కొడి' దూరమైపోవడానికి .. నివేద దగ్గర కావడానికి క్రియేట్ చేసిన పరిస్థితులు మాత్రం ఆడియన్స్ మద్దతును కూడగడతాయి.

ఈ కథలో అక్కడక్కడా వైవిధ్యం కనిపించినప్పటికీ, లవర్స్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చాలా రొటీన్ గా అనిపిస్తాయి. ఆల్రెడీ చూసిన సన్నివేశాలనే మళ్లీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిదానంగా సాగే కథనం కూడా నిరాశను కలిగిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా బాగా చేశారు. ప్రీయుశ్ గురుస్వామి ఫొటోగ్రఫీ .. సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం ..   శక్తి ప్రణీష్ ఎడిటింగ్ గురించి చెప్పుకోవాలంటే, ఫరవాలేదనే చెప్పుకోవాలి. 

సాధారణంగా ప్రేమకథల నుంచి యూత్ ఫీల్ ను ఆశిస్తారు. ఫీల్ వర్కౌట్ అయితే ఆ సినిమా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోవడం జరిగిపోతుంది. లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలలో సహజత్వంతో పాటు, గాఢతను కూడా కోరుకుంటారు. కొత్తదనం కొంత ఉన్నప్పటికీ, రొటీన్ సీన్స్ కారణంగా అసహనాన్ని కలిగిస్తుంది. ఓ మాదిరిగా కనెక్ట్ అయ్యే కంటెంట్ గానే ఈ లవ్ స్టోరీ కనిపిస్తుంది.