అసోంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విధి నిర్వహణలో ఉన్న ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్మగ్లర్లను వెంబడిస్తూ నదిలో పడి ప్రాణాలు కోల్పోయిన జవాన్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కడిమి వేణు (31) బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అసోంలోని కచార్ జిల్లాలో సోమవారం పశువుల స్మగ్లర్లను వెంబడించే క్రమంలో బరాక్ నదిలోకి దూకి గల్లంతయ్యారు. బుధవారం కుశియార నదిలో ఆయన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. "కేవలం 31 ఏళ్ల వయసులో వేణు మరణించడం అత్యంత బాధాకరం. దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని 'ఎక్స్‌' వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా జవాన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వేణుకు నివాళులు అర్పిస్తున్నట్లు ఆమె అన్నారు.

కటిగోరాలోని హరినగర్ బోర్డర్ ఔట్‌పోస్ట్‌లో వేణు విధులు నిర్వహిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర యాదవ్‌తో కలిసి ఆయన స్మగ్లర్లను వెంబడించారు. నిందితులు నదిలోకి దూకడంతో వారిని పట్టుకోవడానికి ఈ ఇద్దరు జవాన్లు కూడా నదిలోకి దూకారు. అయితే, జితేంద్ర యాదవ్ సురక్షితంగా బయటపడగా, వేణు గల్లంతయ్యారు. వేణు భౌతికకాయాన్ని విమానంలో ఆయన స్వగ్రామానికి తరలించి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.