తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న పురాతన దీపత్తూన్ స్తంభంపైనే శనివారం సంప్రదాయబద్ధంగా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆదేశించింది. ఉచ్చైపిళ్లైయార్ మండపం నుంచి తీసుకొచ్చిన పవిత్ర జ్యోతితోనే ఈ దీపాన్ని వెలిగించాలని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ ట్రస్టీల బోర్డును సుప్రీంకోర్టు తక్షణమే సస్పెండ్ చేసింది. ఆలయ పరిపాలన, నిర్వహణ బాధ్యతలను సజావుగా నడిపించేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించింది. అంతేకాకుండా, ఆలయం మరియు కొండ పరిసర ప్రాంతాల భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలకు (సీఆర్‌పీఎఫ్) అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీపత్తూన్‌పై దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ నవంబర్ 20న ఇచ్చిన మునుపటి ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఆదేశాలను ఉల్లంఘించి, దీపత్తూన్‌పై కాకుండా కేవలం ఉచ్చి పిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపం వద్దే దీపం వెలిగించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడాన్ని ఉపేక్షించబోమని, ఇలాంటి వైఖరిని ఉక్కుపాదంతో అణచివేయాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించకూడదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, మధురై జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టు కోర్టుధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, సంభాషణల పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని, తదుపరి విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.

తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపాన్ని ఏ ప్రదేశంలో వెలిగించాలనే అంశంపై ఆలయ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఈ కీలక తీర్పును వెలువరించింది.