టాలీవుడ్ సీనియర్ నటుడు, ఒకప్పటి స్టార్ కమెడియన్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి కుమారుడు మైఖేల్ బెన్నీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. హీరోగా సినీ ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత హాస్యనటుడిగా, విలన్‌గా ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న సుధాకర్.. కెరీర్ ముగింపు దశలో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన దాదాపు నెల రోజుల పాటు కోమాలో ఉన్నారని మైఖేల్ తెలిపారు.

సుధాకర్ సినీ ప్రస్థానంలో 2003-04లో వచ్చిన 'సంక్రాంతి' సినిమా తర్వాత అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని అన్నారు. వరుసగా బిజీగా గడిపిన ఆయన, ఒక్కసారిగా అవకాశాలు తగ్గడంతో తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని.. దీనికితోడు అదుపుతప్పిన మధుమేహం (డయాబెటిస్) సమస్య ఆయనను మరింత కుంగదీసిందని చెప్పుకొచ్చారు. ఈ మానసిక, శారీరక ఒత్తిళ్ల కారణంగా సుధాకర్‌కు తీవ్రమైన బ్రెయిన్ హెమరేజ్ (స్ట్రోక్) వచ్చిందని, దీంతో ఆయన పరిస్థితి విషమించి సుమారు నెల రోజుల పాటు కోమాలోనే ఉండిపోయారని వెల్లడించారు. ఆ సమయంలో తాను 10వ తరగతి చదువుతున్నానని, పరిస్థితి తీవ్రత అర్థం కాకుండా కుటుంబ సభ్యులు మొదట్లో ఆ విషయాన్ని తన వద్ద దాచారని మైఖేల్ గుర్తు చేసుకున్నారు.

అయితే ఆ క్లిష్ట సమయంలో చిత్ర పరిశ్రమ నుంచి సుధాకర్ కుటుంబానికి విశేషమైన మద్దతు లభించిందని తెలిపారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, హీరో జగపతిబాబు వంటి అగ్ర నటులు తరచూ ఆసుపత్రికి, ఇంటికి వచ్చి పరామర్శించారని.. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ వారికి కొండంత ధైర్యాన్ని అందించారని వివరించారు. అందరి ప్రార్థనలు, సరైన వైద్యంతో తన తండ్రి సుధాకర్ కోమా నుంచి కోలుకుని సాధారణ స్థితికి వచ్చారని వెల్లడించారు.

తన తండ్రి కెరీర్ పీక్ స్టేజ్‌ను గుర్తు చేసుకుంటూ.. ఆ రోజుల్లో ఒక కమెడియన్‌గా సుధాకర్ అందుకున్న స్టార్‌డమ్ చాలా అరుదైనదని మైఖేల్ చెప్పారు. తనకు తెలిసినంత వరకు.. అప్పట్లో ఆయనకు అవకాశాలకు గానీ, ఆర్థికంగా గానీ ఎలాంటి లోటూ లేదని పేర్కొన్నారు. చిరంజీవి, సుధాకర్ చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రూమ్‌మేట్స్‌గా ఉన్నప్పటి సంగతులను కూడా ఆయన పంచుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ పనులు పంచుకునేవారని, చిరంజీవి కూరలు వండితే సుధాకర్ అన్నం వండేవారని సరదాగా తెలిపారు. తన తండ్రి నటించిన చిత్రాల్లో ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘పెద్దరికం’, ‘ఖుషి’ సినిమాలు తనకు అత్యంత ఇష్టమైనవని చెప్పారు.

ఇక తన కెరీర్ ఆసక్తుల గురించి మాట్లాడుతూ.. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించే విభిన్నమైన శైలి చిత్రాలు తనకు చాలా ఇష్టమని మైఖేల్ తెలిపారు. తనకు రొమాంటిక్ కామెడీ జానర్ అంటే ప్రత్యేక ఆసక్తి ఉందని, ఇప్పటికే ఆ జానర్‌లో రెండు వెబ్ సిరీస్‌లను రూపొందించినట్లు వెల్లడించారు. నటీనటుల్లో నివేదా థామస్, రామ్ పోతినేని నటనను ఎంతగానో అభిమానిస్తానని, పవన్ కల్యాణ్‌కు తాను వీరాభిమానినని మైఖేల్ స్పష్టం చేశారు.