విజయవాడ నగర మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ఈ ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కార్యాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఆసీనులయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ప్రత్యేక డ్రైవ్‌కు సంబంధించిన తొలి ఫైలుపై రాధాకృష్ణ సంతకం చేశారు.

ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, వన్ టౌన్ ఇన్‌ఛార్జ్ బుద్దా వెంకన్న తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయవాడ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న, కార్పొరేటర్లందరి సమక్షంలో తాను పదవీ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే తమ పనితీరు ఉంటుందని, ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ నగర సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు.

ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వర రావు, సుజనా చౌదరిలతో సమన్వయం చేసుకుంటూ కార్పొరేటర్లందరి సహకారంతో విజయవాడను ఎక్కడా సమస్యలు లేకుండా ఒక పరిష్కార దిశగా ముందుకు తీసుకెళతామని రాధాకృష్ణ పేర్కొన్నారు. శానిటేషన్, హెల్త్ అంశాలపైనే తన తొలి సంతకం చేశానని, దీనికోసం నగరంలో 30 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ అధికారులతో త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించి, ఈ డ్రైవ్‌కు సంబంధించిన పూర్తి కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపారు.