జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కల్యాణ శివ శ్రీనివాసరావు పేరు చెప్పి నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.7 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో ధరణి కృష్ణ అనే మహిళను పోలీసులు మంగళగిరిలో అరెస్ట్ చేశారు. ఈ భారీ మోసానికి సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన ధరణి కృష్ణ గతంలో మంగళగిరిలోని కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేసేది. ఆ సమయంలో శివ శ్రీనివాసరావు తనకు స్వయానా బాబాయి అని చెప్పుకుంటూ నిరుద్యోగులను నమ్మించింది. ఆయనకున్న పలుకుబడితో దేవాదాయ, పోలీసు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఏలూరు జిల్లాలో 16 మంది, తణుకులో 20 మంది నుంచి దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసింది. బాధితులు ఇచ్చిన సొమ్ముకు పార్టీ నేతదే పూర్తి పూచీ అని నమ్మబలికింది.

ఈ క్రమంలో బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు శివ శ్రీనివాసరావు ఫొటోతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్స్ సృష్టించి, ఫేక్ ఆడియో కాల్స్ ద్వారా మాట్లాడించేది. అంతేకాకుండా ప్రభుత్వ ముద్రలు, అధికారుల సంతకాలతో కూడిన నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను తయారు చేసి నిరుద్యోగులకు అందించింది. తాను పనిచేస్తున్న కైరెన్ కన్సల్టెన్సీ, కంపెనీ సీఈవో కోట రుక్మిణి పేర్లను కూడా ధరణి కృష్ణ దుర్వినియోగం చేసింది. నలుగురు బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రిఫండ్ ఇచ్చినట్లు నకిలీ బిల్లులు, రసీదులు కూడా సృష్టించింది.

నవంబర్ 5వ తేదీన తరుణ్ అనే బాధితుడు స్వయంగా శివ శ్రీనివాసరావును కలిసి నిలదీయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. బాధితుడు చూపించిన నకిలీ పత్రాలు, వాట్సాప్ స్క్రీన్‌షాట్లను పరిశీలించిన శివ శ్రీనివాసరావు వెంటనే కన్సల్టెన్సీ సీఈవోను అప్రమత్తం చేశారు. దీంతో కంపెనీ యాజమాన్యం నవంబర్ 9న ధరణి కృష్ణకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నిమ్మకాయల పెద్దిరాజు ప్రోద్బలంతోనే తాను మధ్యవర్తిగా ఉండి ఈ పని చేశానని ఆమె లిఖితపూర్వకంగా అంగీకరించడంతో సంస్థ నుంచి ఆమెను తొలగించారు.

ఈ దారుణ మోసంపై కల్యాణ శివ శ్రీనివాసరావు, కన్సల్టెన్సీ సీఈవో కోట రుక్మిణి వేర్వేరుగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితురాలు ధరణి కృష్ణతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.