కడప జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా జరిగిన ఘర్షణలో ముంతల రామంజులు (వీరాంజనేయులు) అనే జనసేన కార్యకర్త మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ కార్యకర్త మృతికి టీడీపీ నేతలే కారణమంటూ జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి.

వివరాల్లోకి వెళితే.. నామినేషన్ల స్క్రూటినీ సమయంలో జరిగిన గొడవలో రామంజులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహానికి గురైన జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయన మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే, రామంజులు మృతికి జనసేన నేతల అత్యుత్సాహమే కారణమని డీఎస్పీ మురళీ నాయక్ ఆరోపించారు. 

ఈ వ్యాఖ్యలపై జనసేన కడప జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల అసమర్థత వల్లే తమ కార్యకర్త చనిపోయాడని, తమ సర్పంచ్ అభ్యర్థిని స్క్రూటినీకి రాకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో డీఎస్పీ, సుంకర శ్రీనివాస్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన వెనుక పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి, చక్రాయపేట మండల టీడీపీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఉన్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వారిద్దరిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జనసేన రాజంపేట ఇన్‌ఛార్జ్ కోనిశెట్టి హరి రాయల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "పవన్ కళ్యాణ్ గారూ.. చూడండి.. మా వాణ్ని చంపేశారు. ఇది బీటెక్ రవి చేసిన హత్య. మీ రెడ్ల కింద మేం బానిసత్వం చేయాలా?" అంటూ ఆగ్రహంతో తన బూటుతో తానే కొట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

బీటెక్ రవి, మహేశ్వర్ రెడ్డిని కేసులో ఏ1గా చేర్చాలని, స్థానిక ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హరి రాయల్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిణామాలతో నాగులగుట్టపల్లిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.