సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఏఐ ట్రూత్ బాంబ్' పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని ఉపయోగించే వ్యక్తులు, దానిని ఉపయోగించని వారిని భర్తీ చేస్తారని (రీప్లేస్ చేస్తారని) ఆయన స్పష్టం చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనపై తనదైన శైలిలో సుదీర్ఘ విశ్లేషణను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఉద్యోగ రంగంలో ఏఐ ప్రభావంపై తన ఆలోచనలను పంచుకుంటూ.. "చాలా మంది ఉద్యోగులు ఏఐ తమ ఉద్యోగాలను దొంగిలిస్తోందని గట్టిగా అరుస్తున్నారు, కానీ నిజానికి వారే తమను తాము 'దొంగిలించుకుంటున్నారు'" అని వర్మ వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోడ్ రాయడానికి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఐడియాల కోసం, అనలిస్ట్ డేటా విశ్లేషణకు చాట్‌జీపీటీ, క్లాడ్, మిడ్‌జర్నీ వంటి ఏఐ టూల్స్‌ను రహస్యంగా వాడుతున్నారని ఆయన వివరించారు. తాము కష్టపడి చేసినట్టుగా ఆ పనిని పైఅధికారుల ముందు ప్రెజెంట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

"ప్రతి ఒక్కరూ దీన్ని రహస్యంగా చేస్తున్నారు, కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. అయితే, కంపెనీలకు ఈ విషయం గణాంకాల రూపంలో తెలిసిపోతుంది" అని వర్మ అన్నారు. ఏఐ వాడకం వల్ల కంపెనీల అవుట్‌పుట్ పెరిగిందని, నాణ్యత మెరుగుపడిందని, లాభాలు పెరిగాయని తెలిపారు. 

"ఎందుకంటే ఏఐ 24/7 పనిచేస్తుంది, కాఫీ బ్రేక్‌లు తీసుకోదు, అనారోగ్యానికి గురవదు, సహోద్యోగుల గురించి ఫిర్యాదు చేయదు, జీతం అడగదు. అది కేవలం పని చేసి పెడుతుంది" అని ఆయన అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల కోత వచ్చినప్పుడు, ఉద్యోగులు షాక్‌కి గురవుతారని, కంపెనీని, టెక్నాలజీని నిందిస్తారని వర్మ అభిప్రాయపడ్డారు. "కానీ వాస్తవానికి, ఏఐ వచ్చి ఎవరినీ బయటకు గెంటలేదు. ఉద్యోగులు రహస్యంగా తమను తాము ఎప్పుడో రీప్లేస్ చేసుకున్నారు. తాము చేయని పనికి జీతం తీసుకుంటూ కూర్చున్నారు" అని తన పోస్టులో ఘాటుగా పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఏఐ వాడకాన్ని రహస్యంగా ఉంచడం కాదని, దాన్ని బాహాటంగా, దూకుడుగా, ఎలాంటి అపరాధ భావన లేకుండా ఉపయోగించడమే అసలైన నైపుణ్యం అవుతుందని ఆయన తెలిపారు. "భవిష్యత్తు ఎలా ఉన్నా, ఒక కఠినమైన వాస్తవం ఏమిటంటే... ఏఐని ఉపయోగించే వ్యక్తులు, దానిని ఉపయోగించని వారి స్థానాన్ని భర్తీ చేస్తారు" అని వర్మ తన పోస్ట్‌ను ముగించారు.