వైద్యశాస్త్రంలో ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు భారత వైద్యులు. మరణించిన వ్యక్తి నుంచి కూడా సంతానాన్ని పొందే అవకాశాలపై జరుపుతున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు చనిపోయిన వ్యక్తి నుంచి జీవంతో, చలనంలో ఉన్న వీర్యకణాలను విజయవంతంగా సేకరించి సంచలనం సృష్టించారు.

భోపాల్ ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ అండ్ లాబొరేటరీ మెడిసిన్ విభాగాలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని చేపట్టాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఈ ప్రతిష్ఠాత్మక పరిశోధనకు ఆర్థిక సహాయం అందించింది. ఈ అధ్యయనంలో భాగంగా, పరిశోధకులు సుమారు 600 మంది నుంచి 250కి పైగా వీర్య నమూనాలను సేకరించారు. ఇందులో మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాలు కూడా ఉన్నాయి.

మరణం తర్వాత ఒక వ్యక్తి వీర్యకణాలు ఎంత సమయం వరకు జీవంతో ఉంటాయో శాస్త్రీయంగా నిర్ధారించడం ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, మరణించిన వ్యక్తి వారసత్వాన్ని వారి సంతానం రూపంలో కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. కేవలం జ్ఞాపకాలే కాకుండా, మరణం తర్వాత కూడా తమ ఆత్మీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ అవకాశానికి ఈ పరిశోధన నాంది పలికింది. జాతీయ స్థాయిలో ఈ అధ్యయనానికి గుర్తింపు లభించడం విశేషం.