2025వ సంవత్సరానికి సంబంధించి జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఉన్నత స్థాయి జ్యూరీ కమిటీలో సభ్యులుగా ప్రముఖ చలనచిత్ర నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఎస్.గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభలను నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్ పంపిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ కూర్పును ఖరారు చేసింది.

జాతీయ చలనచిత్ర పురస్కారాల జ్యూరీ నియామకానికి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని విజయవాడలోని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్ - ఎఫ్ఏసీ) ఎస్.సురేశ్‌ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను వెలువరించారు.