పిఠాపురం నియోజకవర్గంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థి ఎంపిక వ్యవహారం జనసేన కౌన్సిలర్లలో తీవ్ర అసమ్మతికి దారితీసింది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కౌన్సిలర్లు రోడ్డెక్కడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పిఠాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా బొజ్జా వెంకటేశ్వరరావు పేరును జనసేన పార్టీ ఖరారు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని స్థానిక జనసేన కౌన్సిలర్లు కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గతంలో వైసీపీలో ఉన్న బొజ్జా వెంకటేశ్వరరావు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పనిచేశారని వారు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నిలబడి పనిచేస్తున్న సీనియర్ కౌన్సిలర్ సంధ్యకు ఈ పదవి కేటాయించాలని వారు పట్టుబడుతున్నారు.

అభ్యర్థి ఎంపిక విషయంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌పై కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఈ నిరసనల క్రమంలో ఎంపీ పీఏ చక్రిపై కొందరు దాడికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు.

పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో కూటమి బలం 25 కాగా, ఒక్క జనసేన పార్టీకే 18 మంది కౌన్సిలర్ల సంఖ్యాబలం ఉంది. స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, అంతర్గత విభేదాలు ఈ స్థాయిలో బహిర్గతం కావడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.