ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎనిమిదేళ్ల క్రితం పెను ప్రకంపనలు సృష్టించిన ‘శాండ్‌పేపర్ గేట్’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏర్పాటు చేసిన స్వతంత్ర ఫోరమ్ పరిధిని మరింత విస్తరించింది. 2018 నాటి దక్షిణాఫ్రికా పర్యటనతో పాటు అంతకుముందు జరిగిన 2017-18 యాషెస్ సిరీస్‌లోనూ ‘బాల్ మేనేజ్‌మెంట్’ పద్ధతులపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోరమ్ ఇచ్చే నివేదికను, దాని ఆధారంగా తీసుకునే చర్యలను బహిరంగ పరుస్తామని సీఏ హామీ ఇచ్చింది.

ఆ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుచుకుంది. ఆ సిరీస్‌లో ఆసీస్ బౌలర్లు బంతిని నిలకడగా రివర్స్ స్వింగ్ చేయడంపై అప్పట్లో ఇంగ్లండ్ జట్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పెర్త్ టెస్టులో వర్షం కారణంగా మైదానం తడిగా ఉన్నప్పటికీ బంతి రివర్స్ స్వింగ్ అవ్వడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చని తాము భావించామని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలోనే యాషెస్ సిరీస్‌ను కూడా దర్యాప్తు పరిధిలోకి తెచ్చారు.

సీనియర్ న్యాయవాది ఫియోనా మెక్లియోడ్ నేతృత్వంలో ఈ ఫోరమ్ పనిచేస్తుంది. ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది స్వచ్ఛందంగా తమ వాదనలను లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా తెలియజేయవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. "ఈ ఫోరమ్ ద్వారా ఆటగాళ్లు తమ వాదనలు వినిపించడానికి ఒక సురక్షితమైన అవకాశం లభిస్తుంది. దీని ద్వారా కొత్తగా శిక్షలు విధించడం లేదా పాత గాయాలను రేపడం మా ఉద్దేశం కాదు" అని క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక ఛైర్మన్ డేవిడ్ బూన్ తెలిపాడు.

ఇటీవల ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. కేప్ టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కుట్ర గురించి జట్టు మొత్తానికీ తెలుసని అత‌డు పేర్కొన్నాడు. ఈ వాదనకు డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్ మద్దతు పలకగా, ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్, ఇతర బౌలర్లు దీనిని ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లు తమ వాదనలు వినిపించడానికి ఒక వేదిక కల్పించాలని సీఏ నిర్ణయించింది. కెప్టెన్ కమిన్స్‌కు తమ పూర్తి మద్దతు ఉందని సీఏ ఇప్పటికే స్పష్టం చేసింది. డిసెంబర్ 9 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ఆస్ట్రేలియా సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.