విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) మేయర్‌గా జనసేన పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి హోదాలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా.. నూతన మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణతో ప్రమాణం చేయించారు.

మేయర్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, నగరంలోని 86 డివిజన్ల నుంచి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలెక్టర్ వరుసగా ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నగర పాలక సంస్థపై ఎన్డీయే కూటమి పూర్తి ఆధిపత్యం సాధించినన సంగతి తెలిసిందే. మొత్తం 86 డివిజన్లలో కూటమి ఏకంగా 76 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీ 53 డివిజన్లు, జనసేన పార్టీ 19 డివిజన్లు, బీజేపీ 4 డివిజన్లలో విజయం సాధించాయి. ప్రతిపక్ష వైసీపీ 8 డివిజన్లకే పరిమితం కాగా, సీపీఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.

మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో విజయవాడ నగరంలో నూతన పాలకమండలి అధికారికంగా కొలువుదీరినట్టైంది. తదుపరి నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కొత్త డిప్యూటీ మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు.