నంద్యాల జిల్లా అహోబిలంలో ఈరోజు పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనం అద్దాలను వైసీపీ శ్రేణులు పగులగొట్టాయి. దీనిపై అఖిలప్రియ స్పందిస్తూ... ఈ ఘర్షణలకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. 

అహోబిలం మొదటినుంచీ సమస్యాత్మక గ్రామమని, అక్కడ గతంలోనూ పలు ఘర్షణలు జరిగాయని అఖిలప్రియ పేర్కొన్నారు. ఈసారి కూడా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పోలీసులకు ముందుగానే సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు. పాత నేరస్థులను కంట్రోల్ చేయాలని తాను పోలీసులకు చెప్పానని... అయినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. గొడవలు జరుగుతాయని ముందస్తుగా హెచ్చరించిన తననే పోలీసులు అరెస్టు చేస్తామని అనడం సరైన విధానం కాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

అలాగే, నంద్యాల జిల్లా ఎస్పీ అహోబిలంలోనే ఉన్న సమయంలోనే పరిస్థితులు అదుపు తప్పాయని ఆమె ఆరోపించారు. టీడీపీ మద్దతుదారు ఇంటిపై వైసీపీ మూకలు రాళ్లదాడి చేస్తున్నా, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని అఖిలప్రియ ప్రశ్నించారు.