హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో ప్రాంగణంలో నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది దేశంలోని ఉద్యోగ విపణి, నిరుద్యోగ తీవ్రతపై పెద్దఎత్తున చర్చకు దారితీసింది. కంపెనీ ఎంట్రన్స్ నుంచి రోడ్డు పొడవునా, పార్కింగ్ చేసిన వాహనాల పక్కనుంచి వందలాది మంది అభ్యర్థులు బారులు తీరిన దృశ్యాలు ఐటీ కొలువుల పోటీ స్థాయిని కళ్లకు కట్టాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భారత్‌లో ఎంట్రీ-లెవల్ ఐటీ ఉద్యోగాల కోసం నెలకొన్న తీవ్రమైన పోటీపై తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఇంజనీరింగ్, ఐటీ రంగాలే సురక్షితమైన కెరీర్ ఎంపికలనే పాత భావనపై ప్రశ్నలు సంధిస్తున్నారు. డిజిటల్ యుగంలోనూ అభ్యర్థులను ఆన్‌లైన్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేయకుండా, ఇంత పెద్ద సంఖ్యలో స్వయంగా పిలిపించి రోడ్లపై నిలబెట్టడం సరైన విధానం కాదని కొందరు విమర్శించారు. బీటెక్ ఒక్కటే విద్యార్థుల జీవితానికి మార్గమని, సాఫ్ట్‌వేర్ రంగమే ఏకైక గౌరవప్రదమైన ఉద్యోగమని ఒక తరాన్ని నమ్మించి ఇతర కెరీర్ అవకాశాలను విస్మరించేలా చేశారంటూ కొందరు అసంతృప్తి వెళ్లగక్కారు.

అయితే, ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాల కొరత లేదని, జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో పోటీ సహజమని మరికొందరు సమర్థించారు. ఉన్నత విద్యార్హతలు, ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నంత మాత్రాన సులభంగా ఉద్యోగం దక్కుతుందనే గ్యారెంటీ లేని ప్రస్తుత పరిస్థితుల్లో.. విద్యావ్యవస్థ నుంచి ఏటా బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్ల సంఖ్యకు, మార్కెట్లో లభిస్తున్న అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ దృశ్యాలు మరోసారి తెరపైకి తెచ్చాయి. అయితే ఈ వాక్-ఇన్ డ్రైవ్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎంతమందిని ఎంపిక చేస్తారనే విషయంపై అధికారిక సమాచారం తెలియరాలేదు.