నటుడు, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది రాజకీయ పార్టీల కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఆవేశం కంటే ఆలోచన ఎంతో ముఖ్యమని హితవు పలికారు. ఇటీవల కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఏ రోజైనా చంద్రబాబు, జగన్‌మోహన్ రెడ్డి ఒకరినొకరు చొక్కా పట్టుకుని కొట్టుకోవడం చూశారా? నాయకులు ఎప్పుడూ కొట్టుకోరు, కేవలం మాటలకే పరిమితం అవుతారు" అని వ్యాఖ్యానించారు. కానీ, కిందిస్థాయిలో కార్యకర్తలు మాత్రం ఆవేశంతో ఘర్షణలకు దిగి, ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే కడప జిల్లాలో ఓ జనసేన కార్యకర్త మృతి చెందిన ఘటన తనను ఎంతగానో బాధించిందని ఆది తెలిపారు.

"మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది. ఆవేశంలో ఒకరిపై ఒకరు గొడవపడి, ప్రాణాలు తీసుకుంటే మీ కుటుంబాలే ఇబ్బందుల్లో పడతాయి" అని ఆది సూచించారు. నాయకుల కోసం కార్యకర్తలు గొడవలకు దిగవద్దని, ఆలోచనతో వ్యవహరించాలని ఆయన కోరారు.