నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నెలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఎన్నికల అధికారులు పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

జమ్ములదిన్నె గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మొదలైన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఇరుపక్షాల వారు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుకుంటూ ఘర్షణకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్దే ఈ దాడి జరగడంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో అప్రమత్తమైన ఎన్నికల అధికారులు వెంటనే ఓటింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు, కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహళ్లి గ్రామంలోనూ ఎన్నికల వేళ స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. ఓటర్లను వైసీపీ నాయకులు ప్రలోభపెడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ అంశంపై ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.