పార్లమెంటు ఉభయ సభలు నవంబరు 30 నుంచి అత్యవసర శాసన కార్యకలాపాల నిమిత్తం కొన్ని రోజుల పాటు సమావేశం కానున్నాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ ఛైర్మన్‌ను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

లోక్‌సభ నవంబరు 30న (సోమవారం), రాజ్యసభ డిసెంబరు 2న (బుధవారం) ప్రారంభమై.. ప్రభుత్వ వ్యవహారాల అత్యవసర పరిస్థితిని బట్టి డిసెంబరు 3న ముగిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలు లాంఛనంగా ముగియలేదు. దీంతో ఆ సమావేశాల పొడిగింపుగానే ఈ స్వల్పకాలిక భేటీలు జరగనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త సెషన్‌కు 14 రోజుల ముందస్తు నోటీసు అవసరం కాగా.. కొనసాగుతున్న సెషన్ పొడిగింపునకు రెండు రోజుల నోటీసు సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రత్యేకంగా శీతాకాల సమావేశాలు నిర్వహిస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఈ సమావేశాలు ముగియనుండటంతో, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచే పునర్విభజన (డీలిమిటేషన్), పార్లమెంట్-శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు వంటి కీలక అంశాలు ఈ సమావేశాల ఎజెండాలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ రాజ్యాంగ సవరణలకు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కానుంది. సమావేశాల సన్నాహాలు పూర్తి చేసి అందుబాటులో ఉండాలని మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం.