చిన్నారులతో అసభ్యకర, లైంగిక సంభాషణలకు ఆస్కారం కల్పిస్తోందన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ ఏఐ చాట్‌బాట్ ‘టాకీ’పై టెక్ దిగ్గజం యాపిల్ కొరడా ఝుళిపించింది. నిబంధనల ఉల్లంఘనను గుర్తిస్తూ ఈ యాప్‌ను తన యాప్ స్టోర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా తొలగించింది. చైనాకు చెందిన మినిమాక్స్ సంస్థ సింగపూర్ అనుబంధ సంస్థ సబ్‌సప్ ద్వారా ఈ యాప్‌ను నడుపుతోంది.

ఏబీసీ న్యూస్, యూకే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం బ్యూరో సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వర్చువల్ ఏఐ పాత్రలతో తమ పిల్లలు అసభ్యకరమైన, లైంగికపరమైన సంభాషణలు జరుపుతున్నట్లు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పలువురు తల్లిదండ్రులు గుర్తించి ఫిర్యాదు చేశారు. 

వినియోగదారులు ఏఐ పాత్రలతో భావోద్వేగ సంబంధాలు పెంచుకునేలా దీన్ని రూపొందించారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అనుమతి ఉంది. కానీ వేలాది మంది చిన్నారులు దీన్ని విచ్చలవిడిగా వాడుతున్నట్లు తేలింది. సగటున ఒక్కో వినియోగదారుడు రోజుకు 70 నిమిషాలకు పైగా ఈ యాప్‌పై గడుపుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అభ్యంతరకరమైన యూజర్ కంటెంట్ కారణంగా 2024లోనే ఒకసారి టాకీని యాపిల్ తొలగించింది. 2025లో సరికొత్త వెర్షన్‌తో వచ్చినప్పటికీ పద్ధతి మారకపోవడంతో మళ్లీ బ్యాన్ వేసింది. అయితే, 5 కోట్లకు పైగా డౌన్‌లోడ్లు సాధించిన ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో మాత్రం ఇప్పటికీ అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చాట్‌జీపీటీ, జెమిని లాంటి సాధారణ సహాయక ఏఐల మాదిరిగా కాకుండా.. కేవలం వినోదం, ఊహాత్మక సంబంధాల కోసం పనిచేసే ఈ ఏఐ చాట్‌బాట్ల భద్రతపై ఈ ఘటనతో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.