కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బలపనూరు పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. వైసీపీ అధినేత జగన్ సొంత గ్రామమైన బలపనూరు (సింహాద్రిపురం మండలం) సర్పంచిగా టీడీపీ మద్దతుదారుడు కొత్తరెడ్డి అనిల్‌కుమార్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ పంచాయతీలో టీడీపీ మద్దతుతో సర్పంచి పీఠాన్ని దక్కించుకోవడం విశేషం.

బలపనూరు గ్రామంలో మొత్తం 2,269 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో ఇక్కడ సర్పంచి ఎన్నికలు ఎప్పుడూ హోరాహోరీగా సాగేవి. అయితే ఈసారి వైసీపీ తరపున ఎవరూ నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు. కూటమి తరపున అనిల్‌కుమార్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ బలపనూరు పరిధిలోని స్థానాన్ని అనిల్‌కుమార్‌రెడ్డి కుటుంబానికే చెందిన కొత్తరెడ్డి రవిచంద్రారెడ్డి ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. దీంతో అటు ఎంపీటీసీ, ఇటు సర్పంచి పదవులు రెండూ ఒకే కుటుంబానికి దక్కినట్లయింది.

బలపనూరుతో పాటు సింహాద్రిపురం మండలం మొత్తం కూటమి హవా కనిపించింది. మండలంలోని మొత్తం 20 పంచాయతీల్లో 18 స్థానాలను కూటమి మద్దతుదారులే ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష నేత జగన్ సొంత గ్రామంలోనే నాలుగు దశాబ్దాల తర్వాత టీడీపీ మద్దతుదారుడు సర్పంచిగా ఎన్నిక కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. 
20261126fr7778c6bb813e.png