ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకునే ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్న అధిక ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి చేసిన చిన్న ఆలోచన సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం నాలుగు కిలోమీటర్ల దూరానికి యాప్‌లో ఏకంగా రూ.1,500 ఛార్జీ చూపించడంతో విస్తుపోయిన ఆ ప్రయాణికుడు, ఒక చిన్న ట్రిక్ ఉపయోగించి ఆ మొత్తాన్ని రూ.79కే దక్కించుకున్నాడు.

సన్నీ ఆర్ గుప్తా అనే వ్యక్తి ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-2 నుంచి క్యాబ్ బుక్ చేసే ప్రయత్నం చేశాడు. అరైవల్స్ ప్రాంతం నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరానికి యాప్ రూ.1,500 ఛార్జీతో పాటు 17 నిమిషాల వెయిటింగ్ టైమ్ చూపించింది. దీంతో విమానాశ్రయం లోపల నుంచి క్యాబ్ బుక్ చేయడం మానుకుని, అరైవల్స్ ఎదురుగా ఉన్న ఫెయిర్‌మాంట్ హోటల్ వైపు నడిచాడు. మెట్లు దిగి ఎడమవైపునకు కేవలం రెండు నిమిషాలు నడిచిన తర్వాత, పికప్ లొకేషన్‌ను ఆ హోటల్ సమీపానికి మార్చి మళ్లీ క్యాబ్ కోసం శోధించాడు.

ఆశ్చర్యకరంగా ఆ సమయంలో క్యాబ్ ఛార్జీ ఏకంగా రూ.79కి పడిపోయింది. డ్రైవర్ కేవలం ఆరు నిమిషాల్లోనే పికప్ చేసుకున్నాడు. డ్రైవర్‌కు ఇచ్చిన రూ.50 టిప్‌తో కలిపి మొత్తం ప్రయాణం రూ.125తో ముగిసిందని సన్నీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఇతర ప్రయాణికులు సైతం తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 

ధారావి వరకు ఆక్వా మెట్రోలో వెళ్లి అక్కడి నుంచి టాక్సీ బుక్ చేసుకుంటే రూ.400-500 వరకు ఆదా అవుతుందని ఒకరు చెప్పగా, ప్రీపెయిడ్ టాక్సీలు ఎంతో మేలని మరొకరు పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో సాధారణ ప్రయాణానికి కూడా ప్రయాణికులు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి రావడంపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.