ముంబై నగరం నెత్తురోడిన 26/11 మారణహోమానికి 18 ఏళ్లు నిండాయి. సముద్ర మార్గం ద్వారా దేశ ఆర్థిక రాజధానిలోకి చొరబడిన కిరాయి మూకలు జరిపిన నరమేధం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ దాడి వెనుక కేవలం కొందరు ఉగ్రవాదులు మాత్రమే కాదు.. ఒక దేశపు అధికారిక వ్యవస్థే సూత్రధారిగా నిలిచింది. కాలం మారుతున్నా, పాకిస్థాన్ తన వక్రబుద్ధిని వీడటం లేదు. ఆధారాలు కళ్లముందు కదలాడుతున్నా.. ప్రపంచం నిలదీస్తున్నా.. అసలు హంతకులను కాపాడుతూ తన కుటిల నీతిని చాటుకుంటూనే ఉంది.

తెరవెనుక దాగిన కుట్రదారులు
నాటి దాడిలో తొమ్మిది మంది ముష్కరులను మన భద్రతా బలగాలు అక్కడికక్కడే మట్టుబెట్టాయి. ఆయుధం లేకపోయినా ప్రాణాలను పణంగా పెట్టి ఏఎస్ఐ తుకారాం ఓంబ్లే పట్టుకున్న అజ్మల్ కసబ్ వల్ల దాడి వెనుక ఉన్న పాక్ కుట్ర ప్రపంచానికి తెలిసింది. విచారణ తర్వాత కసబ్‌ను పూణేలోని ఎరవాడ జైలులో ఉరితీశారు. ముంబై వీధుల్లో రక్తపుటేర్లు పారించిన ప్రత్యక్ష హంతకుల పని ముగిసినా, పాకిస్థాన్‌లో కూర్చొని రిమోట్ కంట్రోల్‌తో ఆ నరమేధాన్ని నడిపించిన అసలు సూత్రధారులు మాత్రం ఇంకా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

పాక్ అధికారిక అతిథులుగా ఐఎస్ఐ అధికారులు
దాడికి కుట్ర పన్నిన 15 మంది కీలక వ్యక్తులు నేటికీ పాకిస్థాన్ ప్రభుత్వ కనుసన్నల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. వీరిలో ఐఎస్ఐ, పాక్ సైన్యంలో పనిచేసిన ఉన్నతాధికారులు ఉండటం గమనార్హం. రెక్కీ నిర్వహించిన డేవిడ్ హెడ్లీని నడిపించిన మేజర్ ఇక్బాల్, మేజర్ సమీర్ అలీ పాక్‌లోనే దర్జాగా తిరుగుతున్నారు. దాడి జరిగిన తర్వాత కూడా మేజర్ ఇక్బాల్‌కు ఐఎస్ఐలో పదోన్నతులు కల్పిస్తూ కీలక బాధ్యతలు అప్పగించారు. మేజర్ అలీ కరాచీలో నివసిస్తున్నాడు. అసలు ఇలాంటి వ్యక్తులే లేరంటూ పాక్ పచ్చి అబద్ధాలతో బుకాయిస్తోంది.

కట్టుకథలు.. అరెస్టుల బూటకం
లాజిస్టిక్స్ సమకూర్చిన కల్నల్ హంజా, మధ్యవర్తిగా వ్యవహరించిన మేజర్ అబ్దుర్ రెహ్మాన్ సయ్యద్ వంటి వారిని పాక్ పాలకులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇక మరో కీలక కుట్రదారుడు సాజిద్ మీర్ విషయంలో పాక్ ఆడిన నాటకాలు అన్నీఇన్నీ కావు. తొలుత అతడొక మౌలానా అంది. ఆపై ఆచూకీ లేదని చెప్పింది. చివరకు చనిపోయాడని కూడా ప్రచారం చేసింది. అంతర్జాతీయంగా ఎఫ్‌ఏటీఎఫ్ ఒత్తిడి తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడిని అరెస్టు చేసినట్లు నాటకమాడి.. ప్రస్తుతం లాహోర్‌లో ప్రభుత్వ అతిథిలా చూసుకుంటోంది.

జైలు పేరుతో విలాసాలు
లష్కరే తొయిబా అధినేత హఫీజ్ సయీద్‌ను జైలులో కాకుండా లాహోర్‌లోని ఓ ఇంట్లో పటిష్ఠ భద్రత మధ్య రాచమర్యాదలతో ఉంచింది. మరో ప్రధాన కుట్రదారుడు జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ రావల్పిండిలోని అడియాలా జైలులో అన్ని సౌకర్యాలతో కాలం వెళ్లదీస్తున్నాడు. లాజిస్టిక్స్ విభాగం చూసిన యూసుఫ్ ముజమ్మిల్ మురిడ్కేలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉగ్ర కార్యకలాపాలను నడిపిస్తున్నాడు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారంటూ పాక్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) మోసపూరిత ప్రకటనలు చేస్తోంది.

అధికారిక ప్రోత్సాహంతోనే మారణకాండ
సముద్ర జలాల మీదుగా ఇంతటి భారీ దాడి జరగడం, దానికి అవసరమైన నిధులు, ఆయుధాలు సమకూరడం కేవలం ఒక ఉగ్రవాద సంస్థ వల్ల మాత్రమే సాధ్యం కాదు. దీనికి పాక్ అధికారిక యంత్రాంగం, నిఘా వర్గాలు పూర్తిస్థాయిలో సహకరించాయి. దాడి రూపకర్తలు ఆ దేశానికి అత్యంత విలువైన ఆస్తులుగా మారడం వల్లే అంతర్జాతీయ సమాజం హెచ్చరిస్తున్నా పాక్ వారిని రక్షిస్తోంది.