హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అమ్మకాలు కాస్త మందగించగా, కొత్త ప్రాజెక్టుల రాకతో అమ్ముడుపోని ఇళ్ల (అన్‌సోల్డ్ ఇన్వెంటరీ) సంఖ్య పెరిగింది. 2026 మూడో త్రైమాసికంలో నగరంలో అమ్ముడుపోని నివాస గృహాల ఇన్వెంటరీ 7 శాతం మేర పెరిగినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ 'నైట్ ఫ్రాంక్ ఇండియా' నివేదిక వెల్లడించింది.

మార్కెట్ డిమాండ్‌ను మించి సరికొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల సగటు అమ్మకాల్లో కేవలం 3 శాతం మాత్రమే వృద్ధి నమోదు కాగా.. మార్కెట్లోకి కొత్త సప్లై వేగంగా పెరగడం వల్ల నిల్వలు పేరుకుపోయాయి.

దీనివల్ల హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాల వ్యవధి కూడా పెరిగింది. గత ఎనిమిది త్రైమాసికాల సగటు అమ్మకాల వేగాన్ని బట్టి ప్రస్తుత ఇన్వెంటరీ అమ్ముడవడానికి పట్టే సమయాన్ని క్యూటీఎస్‌ కొలుస్తుంది. 2025 మూడో త్రైమాసికంలో 5.8 త్రైమాసికాలు (1.45 సంవత్సరాలు)గా ఉన్న ఈ వ్యవధి, 2026 మూడో త్రైమాసికం నాటికి 6.1 త్రైమాసికాలు (1.52 సంవత్సరాలు)కు చేరింది.

దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి ఎనిమిది ప్రధాన నగరాల సగటును పరిశీలిస్తే, గత ఏడాది 5.8 త్రైమాసికాలుగా ఉన్న కనిష్ఠ స్థాయి నుంచి ఈసారి 6.1 త్రైమాసికాలకు పెరిగింది. అయితే 2018 నుంచి 2021 మధ్య నమోదైన 7 నుంచి 11 త్రైమాసికాలతో పోలిస్తే ప్రస్తుత వ్యవధి చాలా మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది. ఎన్‌సీఆర్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో అమ్మకాల వ్యవధి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇతర ప్రధాన నగరాల్లో మార్కెట్ పునాదులు ఇప్పటికీ పటిష్ఠంగానే ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ప్రతినిధి గులాం జియా తెలిపారు.