ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాల వ్యవహారంలో ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య విభేదాలు ముదురుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీరుపై ఆ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలో గురువారం జరిగిన ఓ బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ.. "మాటలు పక్కన పెట్టి, చేతలపై దృష్టి పెట్టండి. అహంకారాన్ని వీడాలి" అంటూ మసూద్‌కు వేదికపైనే చురకలు అంటించారు.

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, కేంద్రంలో నరేంద్ర మోదీలను ఓడించడమే కూటమి లక్ష్యమని ఖర్గే స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ నేతలు తమ అహాన్ని పక్కనపెట్టి కలిసికట్టుగా సాగాలని సూచించారు. సొంత పార్టీల మధ్య అంతర్గత పోరే ఈసారి ఎన్నికల్లో విజయాన్ని క్లిష్టం చేస్తుందని హెచ్చరించారు. టీవీల్లో మసూద్ ఆవేశంగా మాట్లాడటం తాను చూస్తుంటానని, అయితే ఆవేశం కంటే కలిసికట్టుగా పనిచేయడమే ప్రగతికి మార్గమని హితవు పలికారు. అంతకుముందు ఇదే సభలో మసూద్ మాట్లాడుతూ.. "మనం ఎవరికీ తక్కువ కాదు, కాంగ్రెస్ వాళ్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి" అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

సీట్ల పంపకాల చర్చల కమిటీలో ఉన్న మసూద్, అంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. "మేం మీ భాగస్వాములమా లేక మీ సేవకులమా?" అంటూ సమాజ్‌వాదీ పార్టీని నిలదీశారు. చర్చలు కొలిక్కి రాకముందే అఖిలేష్ యాదవ్ ఏకపక్షంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 107 స్థానాల్లో పోటీ చేసిందని, ఇప్పుడు మాత్రం కేవలం 26 సీట్లు మాత్రమే ఆఫర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవిధాన్ రక్షా మార్చ్‌కు అనుమతి నిరాకరించడంపైనా మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి స్పందిస్తూ.. ఎన్నికలకు ముందే ఎస్పీ-కాంగ్రెస్ బంధం ఐసీయూకి చేరిందని ఎద్దేవా చేశారు.