భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై త్వరలోనే స్పష్టత వస్తుందన్న ఆశలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఆరంభంలో తీవ్ర ఒడుదొడుకులు ఎదురైనా, అంతర్జాతీయ ప్రతికూలతలను అధిగమిస్తూ ప్రధాన సూచీలు వరుస లాభాలను కొనసాగించాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 390.31 పాయింట్లు (0.46 శాతం) పుంజుకుని 84,328.59 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 65.25 పాయింట్లు (0.25 శాతం) లాభపడి 25,884.50 వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బీఎస్ఈ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు లాభాల బాటలో పయనించి సూచీలకు దన్నుగా నిలిచాయి.

విస్తృత మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.32 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.74 శాతం మేర లాభపడ్డాయి. రంగాలు వారీగా చూస్తే ఐటీ, రియల్టీ, మెటల్ షేర్లు మెరుగైన ప్రదర్శన కనబరచగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, మీడియా రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా ప్రతిపాదిత సుంకాల భయాలు ఉన్నప్పటికీ, విదేశీ నిధుల ప్రవాహం, ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌ను ఆదుకున్నాయి. నిఫ్టీకి కీలకమైన 26,000 స్థాయి వద్ద నిరోధం ఎదురవుతోందని, ఆ మార్కును దాటితేనే 26,200 స్థాయిల దిశగా బుల్లిష్ ర్యాలీ కొనసాగుతుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దిద్దుబాటు జరిగితే 25,800 స్థాయి తక్షణ మద్దతుగా నిలుస్తుందని, తదుపరి రక్షణ 25,600 వద్ద ఉందని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో స్థిరమైన మార్కెట్ రికవరీ కోసం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు తగ్గడం, అమెరికాతో వాణిజ్య చర్చలపై స్పష్టత కీలకమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.