రాష్ట్రంలో ఆదాయార్జన శాఖల పనితీరు, రాబడి వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, పరిపాలనా సంస్కరణలు, క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ సందర్భంగా వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్పెషల్ మార్జిన్‌తో కలిపి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.62,604 కోట్లతో పోలిస్తే ఇది రూ.11,738 కోట్లు అధికమని, మొత్తంగా 18.7 శాతం వృద్ధి నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ (సాయి ప్రసాద్)తో పాటు ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, గనులు, రవాణా, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వార్షిక ఆదాయ లక్ష్యం రూ.1,27,506 కోట్లు కాగా, నవంబర్ 23 నాటికే అందులో 58 శాతం మేర సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 18.8 శాతం, పన్నేతర ఆదాయంలో 31.3 శాతం వృద్ధి నమోదైంది. పన్ను ఆదాయం గతేడాది రూ.53,692 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ.10,104 కోట్లు పెరిగి రూ.63,796 కోట్లకు చేరింది. అలాగే పన్నేతర ఆదాయం రూ.1,330 కోట్ల నుంచి రూ.2,091 కోట్లకు ఎగబాకింది.

శాఖల వారీగా ఆదాయ వివరాలు:
వాణిజ్య పన్నులు: 18.3 శాతం వృద్ధితో రూ.5,917 కోట్ల మేర అదనపు ఆదాయం నమోదైంది. ఇందులో జీఎస్టీ ద్వారా వచ్చిన రాబడి 18.1 శాతం పెరిగి రూ.3,694 కోట్లకు చేరింది.
ఎక్సైజ్ శాఖ: స్పెషల్ మార్జిన్‌తో కలిపి రూ.20,083 కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే 19.6 శాతం వృద్ధితో రూ.3,287 కోట్లు అదనంగా సమకూరింది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు: 16.6 శాతం వృద్ధితో మొత్తం రూ.8,020 కోట్ల రాబడి వచ్చింది.
రవాణా శాఖ: వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా 17.3 శాతం వృద్ధి నమోదై రూ.3,649 కోట్ల పన్నుల ఆదాయం సమకూరింది.
గనులు, భూగర్భ శాఖ: 13.2 శాతం వృద్ధితో రూ.2,086 కోట్లకు చేరింది.
అటవీ శాఖ: 22.3 శాతం పెరిగి రూ.22 కోట్ల ఆదాయం లభించింది.
స్థానిక సంస్థలు: ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకు పంచాయతీల పన్ను ఆదాయం రూ.238 కోట్లుగా, పట్టణ స్థానిక సంస్థల్లో రూ.2,365 కోట్లుగా నమోదైంది.

ప్రజలపై భారం మోపొద్దు: సీఎం చంద్రబాబు
సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండా, కొత్తగా ఛార్జీలు పెంచకుండానే ప్రభుత్వ శాఖల్లో రాబడిని మరింత పెంచేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో లీకేజీలను అరికట్టడం, లోపాలను సరిదిద్దడం, ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకతను పెంచడం వల్లే ఆదాయంలో గణనీయమైన పురోగతి కనిపించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం స్పష్టంగా ప్రతిబింబించేలా ఆదాయ వృద్ధి కొనసాగాలని అధికారులను ఆదేశించారు.

పన్ను వసూళ్ల వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను వసూళ్లకు ఏఐ వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, వాణిజ్య పన్నుల శాఖలోని నాలుగు విభాగాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఏఐ స్టాక్ వినియోగిస్తున్నామని.. పన్ను రిటర్నుల పరిశీలన, ఆడిట్, క్షేత్రస్థాయి తనిఖీలు, న్యాయపరమైన వ్యవహారాల పరిష్కారంలో సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
20261125fr33ae3a9453df.jpg