ఐపీఎల్ 2027 సీజన్ కోసం నిర్వహించే మినీ వేలం సందడి మొదలైంది. ఈ వేలం కోసం మొత్తం 1,220 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 16న గోవా వేదికగా ఈ వేలం జరగనుండగా, పది ఫ్రాంచైజీలు కేవలం 66 ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నాయి.

ఈసారి విడుదలైన ఆటగాళ్ల రిజిస్టర్‌లో 939 మంది భారత ఆటగాళ్లు, 281 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు 184 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, మిగిలిన 66 స్లాట్లలో గరిష్ఠంగా 25 స్థానాలను మాత్రమే విదేశీ ఆటగాళ్లతో భర్తీ చేసే అవకాశం ఉంది. 

ఈ జాబితాలో అన్‌క్యాప్డ్ ఆటగాళ్లదే హవా నడుస్తోంది. మొత్తం 994 మంది అన్‌క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, 184 మంది క్యాప్డ్ ఆటగాళ్లు, 42 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు.

విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 53 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 40, వెస్టిండీస్ నుంచి 36, న్యూజిలాండ్ నుంచి 25, ఆఫ్ఘ‌నిస్థాన్‌ నుంచి 23, శ్రీలంక నుంచి 21 మంది ఆటగాళ్లు ఉన్నారు. అసోసియేట్ దేశాల్లో అమెరికా నుంచి అత్యధికంగా 13 మంది ఉండటం విశేషం.

ప్రస్తుతం పది ఫ్రాంచైజీల వద్ద కలిపి వేలంలో ఖర్చు చేయడానికి రూ.295.60 కోట్ల పర్స్ మిగిలి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.47.45 కోట్లు ఉండగా, ఆ జట్టు 7 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యల్పంగా రూ.8.75 కోట్లు మాత్రమే ఉండగా, ఆ జట్టుకు 3 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. 

ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.39.50 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.30.25 కోట్లు) అత్యధికంగా చెరో 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.40.15 కోట్లతో ఏడుగురిని, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.14.15 కోట్లతో ఐదుగురిని తీసుకోవాల్సి ఉంది.

ఫ్రాంచైజీలు ఈ రిజిస్టర్ నుంచి తమకు ఆసక్తి ఉన్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులకు పంపుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 4న వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు.